ప్రజాశక్తి-కాకినాడ స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేల్ (బొక్కు సొర) షార్క్ డే సంరక్షణాదినోత్సవం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఇవిఎల్.నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ప్రవర్తించాలని, మానవ తప్పిదాల వల్ల ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయన్నారు. ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవి ప్రముఖమైనదేనని, వ్యర్థ పదార్థాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. కాకినాడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టి.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వాటి పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, పరీవాహక ప్రాంతాలు గురించి విద్యార్థులకు వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అందరి బాధ్యత అని, తద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని , సముద్ర తీరాన్ని రక్షించాలని, సముద్ర జీవుల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కాకినాడ కో ఆర్డినేటర్ కేసరి శ్రీనివాసరావు సొర చేప సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పర్యావరణవేత్త ఎన్.బలరాం పర్యావరణ హిత పాటలను పాడి విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనంతరం సొర చేప సంరక్షణ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గత వారం రోజులుగా సముద్ర తీర గ్రామాలలో ప్రజలకు సొర చేప సంరక్షణకై అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన ఫారెస్ట్ అధికారులను రేంజ్ ఆఫీసర్ టి.సత్యనారాయణ అభినందించి జ్ఞాపికలను అందించారు. అనంతరం కళాశాల బాస్కెట్ బాల్ మైదానంలో ఏర్పాటు చేసిన సొర చాప నమూనాను విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎం.నాగార్జున, ఎస్.వీరభద్రరావు, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ డి.మహేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్, అటవీ శాఖ అధికారులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, క్యాంపస్ ఇన్‌ఛార్జి ఎన్.మూర్తి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు తేజేశ్వరరావు, దివాకర్ రావు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










