Sep 23,2023 21:43

ఆడిటోరియం పైకెక్కి జంటలు జంటలుగా ఆటలు

ఆడిటోరియంపై...తేలియాడుతూ..!
జంటలు జంటలుగా స్కేటింగ్‌
పుట్టినరోజు కేకులతో వీరవిహారం
వర్సిటీలో బయట వ్యక్తుల బైక్‌రేస్‌
పట్టించుకోని ఎస్వీయూ ఉన్నతాధికారులు
ప్రజాశక్తి - క్యాంపస్‌
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వాచ్‌ మెన్‌ నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో బట్టబయలు అవుతుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారుల తీరూ అలానే ఉంది. బయటి వ్యక్తులు వచ్చి వర్సిటీలో ప్రాచీన కట్టడమైన శ్రీనివాస ఆడిటోరియం మీద అమ్మాయిలు, అబ్బాయిలు జంటలుగా వచ్చి స్కేటింగ్‌ లాగా తిరుగుతూ ఉంటే వాచ్మెన్‌ ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే వర్సిటీ విద్యార్థులకు చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బయట వ్యక్తులు యూనివర్సిటీలో ప్రవేశించి గంజాయి, హుక్కా, బైక్‌ రైడింగ్‌లు వంటివి చేస్తూ వర్సిటీకి చెడ్డ పేరు తెస్తున్నారని, పుట్టినరోజులను కేక్‌లతో ఆడిటోరియంపైకి ఎక్కి పెద్దపెద్ద కేకలు వేస్తూ జరుపుకుంటున్నారని సమాచారం.
గత నాలుగైదు సంవత్సరాలుగా దాదాపుగా 40 మంది వాచ్‌ మెన్లు ఉద్యోగ విరమణ చేశారు. గతంలో ఔట్సోర్సింగ్‌ పద్ధతిలో 150 మంది వాచ్‌ మెన్‌లను తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంటనే ఔట్సోర్సింగ్‌ సిస్టంను రద్దు చేయడం ద్వారా వాచ్‌ మెన్‌ లు నిలిచిపోయారు. కొంత మంది వాచ్‌ మెన్‌ సిబ్బంది రిటైర్డ్‌ అయినా ఉన్న సిబ్బంది అయినా కనీసం విధులను సక్రమంగా నెరవేరుస్తున్నారా అంటే లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాచ్‌ మెన్‌ల ఇంచార్జీ ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదని, అసలు ఉన్నతాధికారులకూ ఎపుడూ ఆయన రిపోర్ట్‌ చేయడని అపవాదు ఉంది. ఇప్పటికే వర్సిటీలో గత రెండు, మూడు నెలల నుంచి చిరుత సంచరిస్తుందని విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ఉన్నతాధికారుల సైతం రాత్రి సమయాల్లో విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది బయట సంచరించవద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఉదయం, సాయంత్రం సమయంలో విశ్వవిద్యాలయంలో బయట వ్యక్తులు వచ్చి బైక్‌ రైడింగులు, బైక్‌ రేసింగ్‌ లు, కార్‌ డ్రైవింగ్‌ లు, బైక్‌ డ్రైవింగ్‌ లు జరుగుతున్నాయని విద్యార్థులు, పరిశోధకులు అక్కడ వాకింగ్‌ చేసే వర్సిటీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో బైక్‌ డ్రైవింగ్‌ నేర్పిస్తూ, బయటి యువత బైక్‌ రైజింగ్‌ లతో ఇద్దరు ఆచార్యులకు ప్రమాదం జరిగింది. అంతేకాకుండా వర్సిటీలో నిరంతరం మూడో కన్నులాగా పర్యవేక్షించే సీసీ కెమెరాలు సైతం దొంగలించడం వివాదాస్పదంగా విడ్డూరంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు విద్యార్థి సంఘాల నేతలు ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆడిటోరియం పై ఎక్కి ఏదైనా జరగరాని జరిగితే వర్సిటీకి చెడ్డ పేరు వస్తుందని, విద్యార్థుల్లో తల్లిదండ్రులు విద్యార్థులపై నమ్మకాన్ని కోల్పోతారని వాపోయారు. ఇప్పటికైనా వర్సిటీలో అధికంగా వాచ్‌ మెన్‌లను నియమించి భద్రతను కట్టుదిట్టం చేసి విద్యార్థులకు, పరిశోధకులకు, వర్సిటీ సిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆడిటోరియం పైకెక్కి జంటలు జంటలుగా ఆటలు