Oct 22,2023 22:15

ప్రజాశక్తి- నగరి
విద్యార్థులకు చదువెంత ముఖ్యమో ఆటలూ అంతే ముఖ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజనసర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం స్థానిక కేవీకే మైదానంలో 8వ రాష్ట్రస్థాయి జూనియర్‌ బాల్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జీవితంలోగానీ, విద్యలోగానీ, ఆటల్లోగానీ గెలుపుకోసం పోరాడుతూనే ఉండాలన్నారు. తప్పులు సరిదిద్దుకుంటూ వెళితే అందరూ ఛాంపియన్లే అన్నారు. నేడు ఉన్నత స్థానంలో ఉన్నవారందరూ ఎప్పుడో ఒకసారి ఓటమిని చూసినవారే అన్నారు. క్రీడాస్పూర్తితో పోటీల్లో పాల్గొనాలన్నారు. ఆడినా, ఓడినా రికార్డుల్లో ఉంటారని గెలిస్తేనే చరిత్రలో ఉంటారన్నారు. అమ్మనాన్న చాటున గారాబంగా పెరిగేవారు చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేరన్నారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను, సహకరించే గుణాన్ని, బాధ్యతను అలవరుస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలను కల్పించడంతోపాటు, ధైర్యంగా పదిమందికి స్పూర్తిగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. అందుకే క్రీడలను తాను ఎప్పుడూ ప్రోత్సహిస్తానన్నారు. పోరాడితే పోయేదేమీ లేదని ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుందన్నారు. అందరూ చక్కగా ఆడి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై రాష్ట్రానికి పేరుప్రతిష్టలు తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు విజయశంకర్‌ రెడ్డి, వెంకటరావు మాట్లాడుతూ క్రీడలకు ప్రస్తుత ప్రభుత్వం, క్రీడాశాఖ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. ఇటీవల ఆసియా క్రీడల్లో గెలుపొందిన వారికి, జాతీయస్థాయి బాల్‌బాడ్మింటన్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించిందన్నారు. ఇందుకుగాను మంత్రి ఆర్కే రోజాకు కతజ్ఞతలు తెలిపారు. తొలుత ప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసిన మంత్రి ఆర్కేరోజాను క్రీడాభివందనంతోను ఎన్‌సీసీ సెల్యూట్‌లతోను పుష్పవర్షంతో నిర్వాహకులు ఆహ్వానించారు. పోటీల ఆర్గనైజింగ్‌ ఛైర్మన్‌ అయిన మంత్రి జ్యోతిప్రజ్వలన, పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకంతో పాటు, రాష్ట్ర, జిల్లా బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ పతాకాలను ఎగురవేశారు. అనంతరం 13 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను ఆయా జిల్లాల విశిష్ఠతను వివరిస్తూ ఆహ్వానించగా వారు పెరేడ్‌ నిర్వహిస్తూ మంత్రికి గౌరవ వందనం చేస్తూ ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమావేశంలో నాయకులు, క్రీడాకారుల సమక్షంలో మంత్రి భర్త ఆర్కేసెల్వమణి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయలసీమ వీవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి, మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, డీఈవో శేఖర్‌, సీఈవో సెట్విన్‌ మురళీకష్ణారెడ్డి, తిరుపతి సిద్దార్థ, రాయలసీమ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకులు ఆనందరెడ్డి, జిల్లా బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సీహెచ్‌ వెంకటస్వామి, కార్యదర్శి బాలాజీ, ఉపాధ్యక్షులు గోపి, జాయింట్‌ సెక్రటరీ, సుధాకర్‌, డీఎస్‌ఎ చీఫ్‌కోచ్‌ బాలాజి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సురేష్‌బాబు, శాప్‌కోచ్‌ బాబు, నగరి బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ఎంవీ రవిబాబు, అధ్యక్షులు మోహన్‌, కార్యదర్శి నిజాం, పీడీలు చంద్ర, మణి, ప్రకాష్‌, లోకేష్‌, హేమాద్రి, సుబ్బు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.