Aug 19,2023 00:32

నినాదాలు చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు, పివిటిజి

ప్రజాశక్తి-పాడేరు: నవరత్నాలు పేరుతో ఆదిమ తెగల (పివిటిజి) గిరిజనులకు గతంలో ఇచ్చిన వ్యక్తి గత రుణాల పథకాలను రద్దు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు అప్పలనరస అన్నారు. పివిటిజి గిరిజన సమస్యలపై పాడేరు ఐటిడిఎ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం కార్యాలయం నుండి పాత బస్టాండ్‌ వరకు మీదుగా పాడేరు ఐటిడిఎ వరకు వేలాదిమంది పివిటిజి గిరిజనులతో నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం పాడేరు ఐటీడీఏ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మానపడాల్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో . అప్పలనరస మాట్లాడుతూ, పివిజిలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. అంత్యోదయ రేషన్‌ కార్డులు లేక అర్ధాకలితో ఆదివాసీ గిరిజనులు అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్యం అందలేని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక దోలి మోత తో ఆసుపత్రికి మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గడపగడపకు వెళ్లి సమస్యలను పరిష్కారం చేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వానికి రోడ్‌, తాగు నీరు, ఇళ్లు, వంతెనల వంటి సమస్యల కనిపించ లేదా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు మాట్లాడుతూ, పి.వి.టి.జి సమస్యలపై జిల్లా పరిషత్‌లో ప్రశ్నిస్తామని చెప్పారు. పివిటిజిల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ ఐటిడిఏ పిఓ చొరవ తీసుకోవాలన్నారు.
సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బల్‌దేవ్‌ మాట్లాడుతూ, పి.వి.టి.జిలకు ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి.లక్కు మాట్లాడుతూ, నవశకం సర్వేలో కోదు తెగకు గుర్తింపు కాలం లేదన్నారు. దీంతో వివరాలూ నమోదు చేయలేదని, ఇది కోదు తెగ ఉనికికే ప్రమాదమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మిపురం సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌, బాలయ్య, సర్బూ నాయడు, రామన్న, సుందర్‌ రావు, సత్యనారయణ, చిట్టి బాబు, కొర్ర బాలయ్య, భాష విద్యా వాలంటరీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీను, ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నారావు, చింతపల్లి మండల మాజీ ఎం.పి.పి బాబు రావు, కాంగ్రెస్‌ నాయకులు సుబ్బారావు, జనసేన నాయకుడు రాజన్‌, తదితరులు పాల్గొన్నారు. పివిజిటిల ఆందోళనకు స్పందించిన ఐటిడిఎ పిఒ అభిషేక్‌ సమస్యల పరిష్కారానికి హామి ఇచ్చారు.