Nov 11,2022 22:11

ధాన్యం సేకరణలో సాంకేతిక సమస్యలు
యాప్‌లో వివరాలు నమోదు కాని పరిస్థితి
మందకొడిగానే ధాన్యం సేకరణ
ప్రజాశక్తి - ఉంగుటూరు

          ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కొనుగోళ్లు మందకొడిగానే సాగుతున్నాయి. జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి, జిల్లా అధికారులు మూడు రోజుల నుంచి ఉంగుటూరు మండలంలోనే తిష్టవేసి యంత్రాంగాన్ని సమన్వయపరుస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంత వరకూ సక్రమంగానే ఉన్నప్పటికీ యాప్‌లో నమోదులోనే సాంకేతిక సమస్యలతో ఆరుబస్తాలు సేకరణ మూడు బస్తాలు ఎగుమతి... అన్న రీతిగా మారింది. రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వీరపాండియన్‌, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, సంయుక్త కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఆర్‌డిఒ పెంచల్‌ కిషోర్‌, డిఎస్‌ఒ సూర్య నారాయణరాజు, సివిల్‌ సప్లయీస్‌ డిఎం మంజుభార్గవి, జిల్లా సహకార అధికారి ప్రసన్న, భీమడోలు ఎడిఎ పి.ఉషారాజకుమారి, తహశీల్దారు ఎవి.రమణారావు తదితర యంత్రాంగం శుక్రవారం నారాయణపురం, ఉంగుటూరులో రైతుభరోసా కేంద్రాలను సందర్శించారు. నారాయణపురం ఆర్‌బికెలో పరిధిలో ప్రస్తుతం సేకరించిన ధాన్యానికి 11 లారీలు అవసరం ఉండగా మూడు లారీలు రావడంపై అక్కడి సిబ్బందిని కలెక్టర్‌ ప్రశ్నిం చారు. యాప్‌లో సాంకేతిక సమస్యల కారణంగా లారీ నంబరు డిస్‌ప్లే కాకపోవడం, వాలంటీర్‌ యాప్‌ సరిగా పనిచేయని కారణంగా ఎఫ్‌టిఒ (ట్రక్‌ షీట్‌) జనరేట్‌ కాకపోవడం వంటి సమ స్యలను గుర్తించారు. దీనిపై సంబందిత టిసిఎస్‌ సాంకేతిక నిపుణుల బృందంతో అధికారులు సమీక్షించారు. యాప్‌లో చిన్నచిన్న బగ్స్‌లను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని టిసిఎస్‌ ప్రతినిధులు చెప్పారు. ఉంగుటూరులో 2500 ఎకరాల్లో ధాన్యం దిగుబడులు రానున్నాయని శాంపిల్స్‌ సేకరణ, గోనె సంచులు ఇచ్చేందుకు ఒక్కరే సిబ్బంది వల్ల పని జరగదని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సమాధానం ఇచ్చారు. నారాయణ పురం సొసైటీ పరిధిలో 18 ఆర్‌బికె ద్వారా శుక్రవారం ఏడు లారీల్లో ధాన్యం రవాణా చేసేం దుకు అన్ని ఏర్పాట్లు చేసినా యాప్‌ పనిచేయ కపోవడంతో రవాణా ఆగిందని సిబ్బంది చెప్పారు.