Feb 08,2021 13:35

    శేషుబాబు మనవడు చింటూ పుట్టినరోజు వేడుకకు మధ్యాహ్నానికే చుట్టాలంతా దిగారు. సాయంత్రం ఏడు గంటలకి కేక్‌ కటింగ్‌. వాళ్ళింట్లో ఏ సందడి జరిగినా భారీగానే చేస్తారు. శేషుబాబుకి ఒక్కతే కూతురు దివ్య. లేకలేక పుట్టడంతో ముద్దుగా పెంచి, పెళ్లి చేశారు. అల్లుడు కిరీటి మంచి హోదాలోనే ఉన్నాడు. దివ్యంటే ఎంతో ప్రేమ. పెళ్ళయిన ఏడాదికే పండంటి బిడ్డ చింటూని కన్నది. వాడి మొదటి పుట్టినరోజు పండగను ఘనంగా చేస్తున్నారందుకే !
   శేషుబాబుకి తోటలు చాలానే ఉన్నాయి. పాడికీ కొదవలేదు. పెరట్లో వసారాలో ఉంటాయవి. వాటిని చూసుకోడానికి ఇద్దరు పాలేర్లున్నారు. మేతకి తీసుకెళ్ళే వాడొకడైతే, ఇంటిదగ్గర వాటి పనులు చూసుకోడానికి ఒకడుంటాడు. వాళ్ళే తండ్రీకొడుకులు రంగడు, సింగయ్య. ఇంటికొచ్చిన పశువులకు మేత పెట్టి, కుడుతులు తాగించి వాటిని శుభ్రంచేసి జాగ్రత్తగా చూసుకుంటాడు రంగడు. చింటూ పుట్టినరోజు సందడి ఉందని రంగడిని ఉంచి, తను పశువులను మేతకి తీసుకెళ్ళాడు సింగయ్య. రంగడు ఇంటి బైట తోరణాలు కట్టాడు. గుమ్మాలకి అటూ ఇటూ అరటి బోదెలు పెట్టి, కొబ్బరి కమ్మలతో పందిరి వేశాడు. రంగు రంగుల కాగితాలు అంటించి, బూరలు ఊది పందిరి మధ్య అలంకరించాడు. ఇంట్లో వాళ్లూ దివ్య ఎప్పుడు వచ్చినా చింటూని చూసుకొమ్మని రంగడికే అప్పగిస్తారు. వాడికి చింటూ అంటే ఎనలేని ప్రేమ !
   'ఒరే రంగా! ఈ రోజు మాత్రం నువ్వు ఎటూ వెళ్ళకు. ఇక్కడే మా దగ్గర ఉండాలి' అని ముందే హెచ్చరించారు శేషుబాబు ఇంట్లోవాళ్ళు. ఎందుకో నిన్నటిదాకా ఉక్కబెట్టిన వాతావరణం ఒక్కసారే చల్లగా మారిపోయింది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఉంది. గాలీ ఉధృతంగా వీస్తోంది. పందిట్లో అలంకరించినవన్నీ గాలికి అటూఇటూ ఊగిపోతున్నాయి. అల్పపీడనమంటూ ప్రసారం చేస్తున్న టి.వి.లు భారీ వర్షాలకి అవకాశముందని చెబుతున్నాయి. ఇరవైనాలుగ్గంటల్లో వాతావరణం భీకరంగా మారేట్లుంది.
ఇదే రోజున ఏడాది క్రితం చింటూ పుట్టినప్పుడే కోడె దూడ రావుడు పుట్టాడు. ముఖంపైన గోధుమరంగు మచ్చ.. ఒళ్ళంతా చుక్కలతో ఎంత అందంగా ఉంటుందో. ఉన్న ఆవుల్లో పెద్దావుకి పుట్టిన దూడ అది. రంగడికి దాని దగ్గర మచ్చిక ఎక్కువ. మేత నుంచి గడప చేరే దగ్గర వరకూ వాడు దాన్ని విడిచిపెట్టడు. అదీ వాడు పరిగెడుతుంటే చెంగుచెంగున గంతులేస్తుంది. 'అంబా అంబా' అంటూ ఆకలేసి అరిస్తే దాన్ని తల్లి దగ్గరకు తీసుకెళ్ళి, కడుపునిండా పాలు కుడుపుతాడు. అది ఇప్పుడిప్పుడే పచ్చటి లేత పరకలు పడుకుని నెమరవేస్తోంది. అలాగున్నప్పుడు అదెంత బాగుం టుందోనని ముచ్చటపడిపోతాడు రంగడు. ఒకసారి దివ్య వచ్చినప్పుడు రంగడికి రావుడితో ఫోటో తీసింది. దాన్ని అప్పుడప్పుడూ చూస్తూ మురిసిపోతుంటాడు రంగడు.

                                                                  ***

   రావుడి పుట్టినరోజు కూడా ఈ రోజే! దానికీ చింటూ పుట్టినరోజు సమయానికే పసుపు రాసి, కుంకుమబొట్టు పెట్టి అరటిపళ్ళు తినిపించాలనుకున్నాడు. ఈ రోజు అసలు మేతకి తోలకుండా ఇంటిపట్టునే ఉంచమంటే తన మాట వినకుండా రాయుడి గారి తోటలవైపుకి తోలుకుపోయాడు తండ్రి సింగయ్య. అసలే వాతావరణం ఏమాత్రం బాగోలేదు. ఒక్కరోజు వదిలిపెడితే ఏమైందట? తను ఇక్కడే ఉంచి మేతపెట్టి ఆడుకునేవాడు కదా! ఆకాశం ఇంకా నల్లగా మూసేసింది. గాలి ఊపుకి పందిరి కదిలిపోతోంది. చింటూ పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళంతా లోపల గదిలో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
   సాయంత్రం నాలుగ్గంటలైంది.. బాగా ముసురు పట్టింది. రోజూలాగైతే ఈ పాటికి పశువుల మంద ఇంటిముఖం పట్టేది. కానీ ఈరోజు మాత్రం ఇంకా అయిపులేదు. ఉరుములు మొదలైనాయి. మెరుపులు కూడా. జిగేల్మని కళ్ళని మెరిపిస్తున్నాయి.
'ఒరే రంగా! ఎక్కడా? నిన్నే...ఇలారా..?' లోపలి నుంచి పిలుపు.
'ఏం అమ్మగోరూ! ఏటి సెయ్యాల?' ఉన్నపళంగా వాళ్ళముందు వాలి అడిగాడు.
'ఈ కొబ్బరికాయలు ఒలిచిపెట్టు..!' అని చెప్పగానే కత్తి తీసుకుని, ఒకటొకటే ఒలుస్తున్నాడు. కానీ మనసైతే లేదు. ఇంకా తండ్రి పశువుల్ని తోలుకుని ఇంటికి చేరలేదు. అసలే చినుకులు మొదలైనాయి. వెలుతురు క్రమేపీ నశించి, నల్ల దనం చిక్కనైపోతోంది. కొద్దిసేపట్లో వర్షం ముదిరేలా ఉంది.
  పెరట్లో ఏదో అలికిడైంది. గిట్టల చప్పుడు పశువులొచ్చిన సంకేతమిచ్చాయి. గభాలున లేచి పరిగెత్తాడు. తండ్రి సింగయ్య పశువులను రాటలకి కడుతున్నాడు. రంగడి కళ్ళు రావుడి కోసం వెతికాయి. అసలే వెలుతురు లేక పశువుల కొట్టం మసకబారింది. బహుశా మరో శాలలో ఉందేమో! అని అక్కడికి వెళ్ళాడు. కొన్ని ఆవులు మాత్రం ఉన్నాయి తప్ప, రావుడి జాడ లేదు.
అంతే.. రంగడు 'నాన్నా! నా రావుడేడీ?' అడిగాడు.
'ఒరే రంగా! వాన ముంచుకొస్తోంది. పైగా పైన ఉరుములు, పిడుగులు పడేట్లున్నాయి. నాతో బయల్దేరిన వాళ్ళంతా ఒకటే జడిసిపోతూ పరుగు లంకించుకున్నారు. మందని వేగంగా తోలాను. అన్నీ వచ్చినాయిగానీ రావుడు నా కళ్లకి అగుపించనేదు. అసలే సెత్వారమొచ్చినాది గందా? ఎంత ఎతుకులాడినాగానీ పలితం నేకపోయింది. ఏం సేత్తాం? వోన తగ్గినాక అదే వత్తాదిలే అని వచ్చేశా!' అని తుండుగుడ్డతో ఒళ్ళు తుడుచుకోసాగాడు సింగయ్య.
'ఎంత పని సేశావయ్యా! నా బుజ్జి రావుడు పుట్టి ఇయ్యాల్టికి సమచ్చరమైనాది. దానిక్కూడా పసుపురాసి, కుంకుమ బొట్టెట్టి సరదా సేసుకుందావని సూశా! కానీ దాన్ని ఒంటరిగా ఒగ్గేసి వచ్చేసిశావ్‌! ఏందయ్యా అట్టా సేసినావ్‌?'అని నిలదీశాడు.
రావుడి మీద అభిమానం తండ్రిపైన కోపం పుట్టేలా చేసింది.
   'నీకేటి తెల్సున్రా! అసలే పిడుగులు జనాల పేనాలు తీసి సంపుతున్నారు! అసలు దారే కనబడక ఎలా తోలు కొచ్చినానో నాకే తెల్దు. నీ రావుడి కోసం నేను సూసు కుంటూ కూసుంటే నేనూపిరి వొదిలేవోన్ని. ఈ మద్దెన ఏటైనాదో నీకు తెల్వదా? పెద్దిరాజు గోరింట్లో పనిసేసే ఏసోబుగాడు ఇట్టానే పశువుల్ని తోలుకెల్లి వొర్సం వొచ్చి నాదని ఓ సెట్టుకాడ నిలబడితే ధడాల్న ఓ అగ్గిపిడుగు పడితే అక్కడికక్కడే బూడిదైపోనాడు. మరాల్ల కుటుంబానికి ఆడే దిక్కుగందా? ఆడు పోగానే ఆల్ల బతుకులు బుగ్గైపో నేదా? దేన్తోనైనా ఎట్టుకోవచ్చుగాని.. పెక్రుతితో ఎదురు తిరక్కూడదురా! మరో వారం రోజులిట్టానే ఉంటాయట వొర్సాలు.. పిడుగులు పడ్తాయని పేపర్లో, టివీల్లో ఒకటే గోలెడ్తున్నాయట! ఇలాటి వాతావరనంలో తోటలెంట దొడ్లెంట తిరక్కూడదు! శాలా పెమాదం!' అని హెచ్చరికగా అన్నాడు సింగయ్య.

                                                               ***

    రంగడికి ఒక్కసారిగా దుఃఖం ఎగదన్నుకొచ్చింది. రావుడు ఈ భయంకర వర్షంలో ఎక్కడ ఉండిపోయాడోనన్న ఆవేదన చుట్టేస్తోంది వాడిని. పాపం నోరులేనిది.. తన బాధ ఇది అని చెప్పుకోలేదు. అలాంటిది ఈ వానలో చిక్కడిపోయి బిక్కుబిక్కుమంటూ ఏడ గడుపుతోందో?.. ఓవైపు దానికి ఆకలి వేసే సమయం. మరి అలాంటి దాన్ని విడిచిపెట్టి రావడా నికి తండ్రికి మనసెలాగొప్పిందో నని అను కున్నాడు రంగడు.
'అయ్యా! నువ్వొగ్గేసినట్టుగా నేను నా రావుడ్ని యిడిసిపెట్టి ఇక్కడ కూకోలేనయ్యా! ఎంటనే ఎల్లి దాన్ని ఈ గడపలోకి తీసుకొస్తా!' అన్న రంగడివైపు దిగ్భ్రాంతిగా చూశాడు సింగయ్య.
'నీకేవైనా మతిసుతి ఉన్నాయా? నేవా? ఇట్టాటి గోరవైన వర్సంలో నువ్వు ఎల్తానంటావేటి? పిడుగులు పడితే నీ పేనాలు తోడుకుపోతాయి. నన్నుసురు పెట్టకు. దూడ పోతే పోయె. మరోటి పుడతాది. కానీ బంగారంనాటి నువ్వు ఎదురీది ఎల్లకూడదు. వద్దు..ఎల్లద్దు..' అని రంగడిని హెచ్చరిస్తూ ఆపాడు.
ఐనా రంగడు ఏమాత్రం తాత్సారం చేయకుండా వర్షంలోకి దూకుతూ ఒక మాటన్నాడు- 'నీకు నాపైన కొడుకుగా ఎంత పేముంటాదో రావుడి మీద పెద్దావుకి పేముండదా? అది కొట్టంలోకి రాకుంటే అది ఎతుక్కోదా? దూడకేటైనా జరిగితే దాని కడుపు తరుక్కుపోదా? మనసుం డాలయ్యా! గొడ్డుకి మాతరం పేనాలు తీపికావా? ఆటికి ఇలువనేదా? మనవేనా గొప్పోల్లం. నేదు, నేను ఎల్తా! ఏటైతే అదవుద్ది. నేను రావుడితోటే తిరిగొత్తా. పేనాలు తోడుకు పోతే పోనీ..' అని గబాల్న వర్షంలోకి దూకేశాడు రంగడు.
సింగయ్య హతాశుడైనాడు. కళ్ళెంట వడివడిగా నీళ్ళు దుమికాయి. ఈ ఘోరమైన వాతావరణంలో ఈ తెగింపు పనికిరాదనుకున్నాడు. రంగడు పరిగెడ్తున్నాడు.. బురద ఒళ్ళంతా తుళ్ళుతోంది. ఒక్కోసారి జర్రున జారుతున్నాడు. తలమీంచి నీళ్ళు వరదలాపారి కళ్ళల్లోకి జారుతూ, దారి కనబడకుండా చేస్తున్నాయి. గాలి రివ్వురివ్వున వీస్తూ చెంపపెట్టు పెడుతోంది. రాయుడిగారి తోటలవైపు రంగడి పరుగు సాగుతోంది. పక్కనున్న ఎర్రచెరువులోకి మదుంలోంచి నీళ్ళు ఒకటే పారుతున్నాయి. ఆ ఉధృతికి గట్టు తెగి ఊళ్ళోకి చెరువు పొంగే ప్రమాదం కూడా పొంచి ఉంది. చెట్లు విపరీతంగా ఊగిసలాడుతున్నాయి. దూరంగా ఉన్న బోడికొండ మీంచి నీళ్ళు దబదబ భూమ్మీద పడి, భీకర శబ్దం చేస్తూ గుండె దడ పుట్టిస్తున్నాయి.
   ఎప్పుడూ సింగయ్య రాయుడిగారి తోటలకావల పొలాల్లో పశువుల్ని మేపుతుంటాడని మాత్రం తెలుసు.. ఒక్కోసారి తండ్రికి ఒంట్లో సులువు లేకపోతే రంగడే పశువుల్ని తోలుకెళ్ళి మేపుతాడు. అందువల్ల దారి గుర్తుంది.. కానీ ఈ విపరీతమైన వర్షంలో కోడెదూడ రావుడు అక్కడే ఉంటాడని కచ్చితంగా చెప్పలేం.. ఈ ఘోరమైన వర్షంలో భీకర శబ్దాలకి జడిసి, ఏ మూలకెళ్ళిపోయాడో.. ఒకవేళ గుండాగి ఎక్కడైనా విగతజీవిగా పడి ఉంటే అసలు తెలీదు. లేదు.. తన రావుడికి ఏమీ కాకూడదనే ఆశతో ఉన్నాడు.. బయల్దేరింది మొదలు మనసులో ఒకటే మొక్కుకున్నాడు 'రావుడికేమీ కాకూడదని!'. వర్షం మరింత ఉధృతమైంది. హోరుమంటున్న చప్పుడు.. గూబల్లోంచి దూసుకొచ్చి, చెవుల్ని నొప్పి పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా కళ్ళు జిగేల్మనిపించేలాగ ఆకాశంలో మెరుపులు.. చీకట్లను చీలుస్తున్నట్లుగా.. దాని వెంటే ఒక్కసారిగా భయంకరమైన పిడుగులు భూమి దద్దరిల్లిపోయేలాగ పడుతున్నారు!
  రంగడు నడకలో వేగం తగ్గలేదు.. మధ్యమధ్యలో ఒక్కోచోట కసుక్కున తుమ్మముళ్ళు అరిపాదాల్లోకి దిగుతున్నాయి. అయినా వెంటనే వాటిని ఊడబెరుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు. వాడికి ఒకటే పట్టుదల.. ధ్యేయం.. తన రావుడిని వెతికి క్షేమంగా గడప చేర్చాలి. ఇప్పటికే ఆకలితో అల్లాడిపోతున్న ఆ మూగజీవికి తల్లి దగ్గర పాలు తాగించి, సేద తీర్చాలి. వర్షం విసురు ఒక్కసారిగా వాలు మార్చి ఎడాపెడా కొడుతోంది. ఒకవైపు పెద్ద పెద్ద ఉరుములు.. కళ్ళల్లో సూదులు పొడుస్తున్నట్లుగా మెరుపులు.. తోటలు దాటి ఎగువ బందల్లోకి వెళ్ళి కళ్ళు చిట్లించుకుని వెతుకులాడుతూ ''రావుడూ....రావుడూ..'' అని కేకలు పెట్టాడు.
  అది పుట్టినప్పుడే ''రావుడు'' అని పేరుపెట్టి, రోజూ దాన్ని అలాగే పిలవడంతో దానికీ అలవాటైంది. రంగడు పిలవడంతోటే ఎక్కడున్నా సరే చెవులు రిక్కించుకుని మరీ వాడి దగ్గరకి పరిగెత్తుకొస్తుంది. ఆ అలవాటు ఇప్పుడు కొంచెమైనా ఉపకరిస్తుందని రంగడి ఆశ. ఆ ఆశతోనే కేకలతో ప్రయత్నిం చాడు. నిజానికి వర్షమే లేకుంటే ఆ అరుపులు ప్రతిధ్వనించి చుట్టూతా మారుమోగేవి.
కానీ ప్రస్తుతం మాత్రం అవి గాలికి, వర్షానికీ విసిరికొడుతున్నా యి. రంగడు తన ప్రయత్నాన్ని విడిచి పెట్టకుండా పట్టువదలని విక్రమార్కుడు అనిపించుకు న్నాడు. ''రావుడూ..రావుడూ!'' మళ్ళా పిలిచాడు. రెండు అరచేతులు నోటికి రెండు వైపులా అడ్డం పెట్టుకుని తిన్నగా దూసుకెళ్ళేలాగ.. మళ్ళా.. మళ్ళా.. పిలుస్తూనే ఉన్నాడు. గొంతు చిరిగి పోతుందేమోనన్నంత భీకరంగా పెంచి, చించుకుని అరుస్తు న్నాడు. దెయ్యాలదిబ్బ దగ్గరకు వచ్చాడు. అక్కడ పాడుబడిన గుడి ఒకటి ఉంది. శిథిóóలా వస్థలో ఉన్న దానికి దెయ్యాల గుడి అని పేరు.. మామూలు రోజుల్లో పశువులకాపర్లు క్యారేజీలు విప్పుకుని, బువ్వలు తింటారు. ఈ సమయంలో వర్షానికి అది కూలినా కూలి పోవచ్చును.. అక్కడికొచ్చాక ''రావుడూ'' అని మరోసారి పిలిచాడు గట్టిగా.. వాడి ప్రయ త్నం ఈసారి ఉత్తి పోలేదు....''అంబా!...అంబా..'' అని వినిపించింది.. ''ఔను! అది తన రావుడి అరుపే! అంటే అక్కడికి దగ్గర్లోనే ఎక్కడో అక్కడ ఉండాలి..!'' అని రంగడి కళ్ళు వెతుకులాడాయి. పిలుపు ఆపలేదు.. మళ్ళా అరిచాడు. తిరిగి జవాబుగా ''అంబా!'' అంటూ అరుపు వినిపించింది.. చెవుల్లోకి పడ్డ ధ్వని.. దారి చూపించినట్లుగా అయ్యింది.
   దెయ్యాలగుడి వైపు అడుగులు వేగంగా పడ్డాయి. ఒక వైపు ముళ్ళు కసుక్కుమని కోస్తున్నాసరే.. ఆగని పరుగు అక్కడికి చేర్చింది. ఆకాశంలో మెరిసే మెరుపుల్లో ఒక్క సారిగా రావుడి రూపం కనబడింది. ఇక రంగడి సంతో షానికి పట్టపగ్గాల్లేవు. ''తన రావుడికేం కాలేదు. నిక్షేపంలాగు న్నట్టే!'' అనుకుంటూ దెయ్యాలగుడిలోకి దూసుకెళ్ళాడు. దగ్గరగా వెళ్ళాడు. దాని ఒళ్ళంతా తడిసిముద్దయ్యింది. పాపం గజగజ వణుకుతోంది. రంగడు దాని ఒళ్ళంతా ఆప్యాయంగా తడిమాడు. ముఖం మీద ముద్దుపెట్టు కున్నాడు. ఎలాగైనా ఇక్కడ్నించి దాటేయాలి. రంగడిని చూడ్డంతోనే రావుడికీ ఎక్కడ్లేని ధైర్యం వచ్చేసినట్లుగా చెవులు నిక్కబొడిచి చూస్తూ వాడికి దగ్గరగా రాసుకు నిలబడింది. దూరంగా ఒక్కసారిగా పిడుగుపడిన శబ్దం భయంకరంగా.. దిక్కులు పిక్కటిల్లేలాగ.. ఇక ఏమాత్రం వాతావరణానికి జడవకుండా రావుడిని మెడ మీద వేసుకుని నడక మొదలెట్టాడు. వాన విసిరికొట్టడం ఆగలేదు. మబ్బులు దండిగా మూసేయడం వల్ల దారి మరింత మసకబారింది. చెరువులోకి పడుతున్న వర్షం నీటి ఉరవడికి ధబేల్మన్న చప్పుళ్ళు భీకరంగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు మెరిసే మెరుపుల జాడల్లోకి కళ్ళు చిట్లించుకుని చూస్తూ నడకలో వేగం పెంచాడు. రావుడి బరువు వల్ల పరుగు సాధ్యం కావడంలేదు. దగ్గరలో కొన్నిచోట్ల రావుడిని దించి, మళ్ళా భుజాలపైకి మార్చుకొని నడుస్తున్నాడు. మధ్యమధ్యలో కొన్ని చెట్లు కింద నుంచి వెళ్ళవలసి వచ్చినప్పుడు అవి కూలిపోతాయేమో అన్నంతగా నేలపైకి వంగిపోసాగాయి.
   మరోసారి ధడేల్మంటూ పిడుగుపాటు భయంకరంగా.. ఒక్కసారిగా నేల మీదకు వంగి నడిచాడు రంగడు. అంత చలిలోనూ చెమట్లు పట్టినట్లుగా అయిపోయింది శరీరమంతా. అయినా భరిస్తున్నాడు.. మధ్యమధ్యలో ఆకలివల్ల కాబోలు దూడ ''అంబా...అంబా'' అంటూ అరుస్తోంది. రంగడికి తెగ జాలిగా ఉంది. 'పొద్దుటేలనగా తండ్రి తోలుకెళ్ళాడు. కడుపు కాల్తుందేమో తెలీదు.. కిందటేడు ఈసరికి రావుడింకా తల్లి కడుపులోనే ఉన్నాడు. పెద్దావు ఏ టయానికి ఈనుతుందోనని కరెంటు లేకపోతే లాంతరు బుడ్డి పట్టుకుని తను, అయ్య కాచుకుని కొట్టంలో కాపలా కూర్చున్నాం. ఈత కష్టమైందేమోగానీ పెద్దావు గింగిరాలు తిరిగేసింది. ఒకటే జాపోత.. నోటి వెంట చొంగలు కారాయి. రాట చుట్టూతా ఒకటే తిరుగుడు.. చిట్టచివరికి పెద్దావు కోడెదూడ ఈనింది. సరిగ్గా అదే సమయానికి శేషుబాబుగారికి మనవడు పుట్టాడన్న కబురు కూడా వచ్చింది!'' వంద సింహాలొక్కపారి గర్జించినట్లుగా ఆకాశం.. ఒక్కసారిగా వెన్ను జలదరించింది. ఆలోచనల్లోంచి బైటపడి ఇంకాస్త దూరం వెళ్ళేసరికి తనకు అలవాటైన దారిలోకి వచ్చినట్లుగా అనిపించింది.
''ఔను! దూరంగా మసకమసకగా కనిపిస్తున్న తోటలు శేషుబాబుగారివే! అక్కడికి ఇల్లు దగ్గరే!'' అనుకుంటూ తాటితోపుల దగ్గరకొచ్చేసరికి బంకమట్టి అడుసు తగిలింది. జర్రున జారేసరికి మెడమీంచి దూడ కూడా కిందకి జారింది. రివ్వున గాలి ఫెడీమని కొట్టడంతో ఒక్క క్షణం లేవలేకపోయాడు. మళ్ళా శక్తి తెచ్చుకుని రావుడ్ని భుజానికెత్తుకుని నిలబడ్డాడు. ఎక్కడో దూరంగా మరో పిడుగు పడి గుండెలను అదరగొట్టింది.
  అంత వర్షంలోనూ శేషుబాబుగారి తెల్లమేడ కనబడింది. హమ్మయ్య అనుకున్నాడు. ''ఈ గండం గట్టెక్కినట్లే..'' అనుకుంటూ గబగబా పశువుల కొట్టంలోకి నడిచాడు.
  రంగడిని చూసిన తండ్రి సింగయ్య 'ఒరే! నేనెంత బెంగటిల్లిపోనానో తెల్సునా? ఈ వోనకి నువ్వెక్కడ సిక్కుకుపోయి ఏ కట్టాలు ఎదుర్కొన్నావోనని.. సిన్నప్పట్నించి పెంచిన ఆ కడుపుకోత నీకు తెల్వదురా..? అందుకే నీపైనే నా జ్యాసంతా..!' అని ఒళ్ళంతా తడిమాడు. తుండుగుడ్డ తెచ్చి రంగడి తలను తుడవబోతుంటే దాన్ని అందుకుని, రావుడి ఒళ్ళంతా తుడిచాడు. 'నీకెంత నాపైన పేముందో.. నాకూ ఈ రావుడిమీదంతే పేముందయ్యా! అందుకే ఎంత వోనైనా తెగించి ఎల్లినా.. మనవైతే బాద సెప్పుకోగలం.. ఈ మూగది ఏటని సెప్పుకోగల్దు? అందుకే రచ్చించాలనిసెప్పి ఎల్లి పెమాదం నుంచి తప్పించి తీసుకొచ్చా!'' అని కొట్టంలో ఎండుగడ్డి తెచ్చి ఒళ్ళంతా గట్టిగా పామాడు.. వెంటనే పెద్దావు దగ్గరకి తీసుకెళ్ళి పాలు కుడిపాడు.
  అది సంతృప్తిగా పాలు కుడిపింది. రంగడి మనసెంతో హాయిగా ఉందిప్పుడు.. అంత వర్షంలోనూ చింటూ పుట్టినరోజు వేడుక ఘనంగా జరుగుతున్నట్లుగా పాటలు మారుమోగుతున్నాయి. అదే సమయానికి రంగడు లోపలికెళ్ళి గూటిలో ముందే ఉంచిన పసుపు కుంకుమ తెచ్చాడు. రావుడి ముఖంపైన పసుపు పూసాడు. శంఖం మచ్చకు మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాడు. ఆప్యాయంగా ఒళ్ళంతా తడిమాడు. గంగడోలు దగ్గర సుతిమెత్తగా రాశాడు. ఆ హాయికి అది మెడ ఎత్తింది.
''అయ్యా! యియ్యాల్టికి రావుడు పుట్టి ఏడాది.. దాని పుట్టినరోజు కూడా చింటూబాబుతో పాటే.. అందుకేనయ్యా! వొర్సానిక్కూడా జంకకుండా......'' అన్నప్పుడు రంగడి గొంతులో అలవిమాలిన అభిమానం, ప్రేమ తొంగిచూశాయి.
కొడుకు అలాగన్నప్పుడు సింగయ్య హృదయం ద్రవించింది. దగ్గరగా వెళ్ళి రంగడితోపాటు రావుడ్ని కూడా ఆప్యాయంగా గుండెలకదుముకున్నాడు.
''ఒరే సింగయ్యా! రంగా! మీరిద్దరూ అక్కడేం చేస్తున్నార్రా! రండి చింటూబాబు కేక్‌ కటింగ్‌ అవుతోంది...'' అన్న అమ్మగారి పిలుపుకి వెంటనే లేచి వడివడిగా కదిలారు.. రంగడి వెంట రావుడు కూడా హుషారుగా వెంటపడింది.

కె.కె.రఘునందన
9705411897