Jul 25,2022 00:08

ఆలయ వెనుక భాగంలో కొండను తవ్వి జోరుగా సాగుతున్న మట్టి తవ్వకాలు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
'తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్టి కోసం' అని వెనుకటికొకడు అన్నట్లు.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, వాకపల్లి జంక్షన్‌ నుంచి వెంకటేశ్వర ఆలయానికి వెళ్లేందుకు 36 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నట్లు భద్రాచలానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమ్మిస్తున్నాడు. తాను కొన్న భూమిలో ఈ రోడ్డు నిర్మిస్తే ఎవర్నీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమ్మించాల్సిన పనిలేదు. కానీ... ఇక్కడ జరుగుతున్నదంతా వేరు. ఆలయానికి వెళ్లేందుకు నిర్మిస్తున్నట్లు చెబుతున్నంత రోడ్డంతా ప్రభుత్వ భూమిలో కావడం గమనార్హం.
గతంలో ఉన్న గోర్జి, దీనికి దారిపొడవున వన్న కొండ కింది భాగాన్ని ఎటువంటి అనుమతుల్లేకుండా పేల్చి రోడ్డు నిర్మించడంతోనే వ్యాపారి అసలు దురుద్దేశం బయటపడింది. మధ్యలో కొంత జిరాయితీలో తప్ప మిగిలిన రోడ్డంతా ప్రభుత్వ భూమిలో వేశాడు. దాదాపు 70 ఎకరాల లే అవుట్‌ను అభివృద్ధి చేసి సొమ్ముచేసుకొనేందుకు ఈ రోడ్డు నిర్మిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అభివృద్ధి చేయాలనుకున్న 70 ఎకరాల లే అవుట్‌లో మారేపల్లి సర్వే నెంబరు 115లోని 23.15 ఎకరాల ఆలయ భూమివున్నట్లు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొనుగోలు చేసిన దాదాపు 35 ఎకరాల ప్రయివేటు భూమిలోనూ మధ్యమధ్యలో ప్రభుత్వ భూమివుంది. తారువ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబరు 184లో పులిమెట్ట కొండ నుంచి తిమిరం వరకు వెళ్లేందుకు 2.30 ఎకరాల గోర్జి వున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 180-22లో 35 సెంట్లు గయాళ్ల భూమివుంది. 182లో 45 సెంట్లు పోరంబోకు భూమివుంది. రెడ్డివారిచెరువు వుంది. ఈ చెరువు కింద కొన్న భూమితో పాటు పైనున్న ప్రభుత్వ భూమినంతా కలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానికులు తెలిపారు.
నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నం
దేవాలయానికి రోడ్డు వేస్తున్నట్లు నమ్మించేందుకు, ప్రజల నుంచి అభ్యంతరాలు రాకుండా వుండేందుకు ఆలయానికి రియల్టర్‌ మెట్లు కట్టిస్తున్నాడు. ఆలయ భూమిలో వేసిన లే అవుట్‌ నుంచి కొండపైనున్న ఆలయానికి వెళ్లేందుకు పనులు జరుగుతున్నాయి. మెట్లు కడుతున్న చోట నుంచి తూర్పు వైపున వున్న శారద నది వరకు రోడ్డు వేశాడు. మొత్తం ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మట్టి కోసం దేవాలయానికి ఎడమ వైపున్న ఎత్తెన కొండను భారీగా తవ్వేసి, రెండు కొండల మధ్య దారి చేశాడు. ఇప్పటికీ ఈ మట్టిని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు పనులకు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. వెనుకభాగం నుంచి ఆలయం వద్దకు వాహనాలు వెళ్లేందుకు కొండను తవ్వి రోడ్డు వేయనున్నట్లు అక్కడ మెట్ల నిర్మాణ పనులు చూస్తున్న నిర్వాహకులు చెప్పారు. చేసిన, చేస్తున్న ప్రతి తప్పుడు పనికీ ప్రజా ప్రయోజనం వున్నట్లు రియల్టర్‌ నమ్మిస్తున్నాడు. నిజానికీ దేవాలయానికి వెళ్లేందుకు రోడ్డు వేసే దయాగుణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి వుంటే వాకపల్లి, మారేపల్లి, తారువ పంచాయతీల నుంచి ఆమోదం తీసుకొనివుండేవాడు. ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు పొందివుండేవాడు. కొండలను తవ్వేందుకు గనులశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొనేవాడు. కొండను పేల్చేందుకు రెవెన్యూ అనుమతి కోసం లెటర్‌ పెట్టేవాడు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని దేవాదాయ శాఖను కోరేవాడు. ఈ ప్రక్రియ ఏదీ జరగలేదు. ఉత్తరప్రత్యుత్తరాలు నడవలేదు. నడపలేదు. తాను నిర్మిస్తున్న రోడ్డు, తవ్విన కొండ వెనుక వ్యాపార ప్రయోజనం తప్ప ప్రజల ప్రయోజం లేదని రియల్టర్‌కు తెలుసు కనుక 'సక్రమంగా' ఏ పనీ చేయలేదు. పక్కాగా వెళితే ఈ పనులన్నీ జరగవని తెలిసి, ఆలయ అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుని ఆశీస్సులతో పనులు చకాచకా చేయిస్తున్నాడు. పెద్ద నాయకుని సహకారంతో ఈ దురాక్రమణ, ఉల్లంఘనలు జరగడంతో ఆపలేక అధికారులంతా మౌనం ప్రదర్శిస్తున్నారు. బహిరంగంగా రోడ్డు పనులు, లే అవుట్‌ అభివృద్ధి పనులు, కొండ తవ్వకాల విషయం తెలీవంటూ సంబంధిత అధికారులు సమాధానమిస్తున్నారు.