Sep 22,2021 06:11

  • నేడు ప్రభుత్వ ఐటిఐ అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సు

సి.ఎం. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులతో చెప్పిన మాటలకు... క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతనే లేదు. సి.ఎం ఆదేశాలన్నీ సమావేశాలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి నైపుణ్యంపై ప్రభుత్వం దృష్టే పెట్టడం లేదు. కనీసం పరిశ్రమలతో సమన్వయం కూడా చేయడం లేదు. ఐటిఐ లలో శిక్షణ ఇచ్చేందుకు కూడా అధ్యాపకులు లేరంటే ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
    దేశం లోకి 1990 తరువాత పెద్ద ఎత్తున సరళీకరణ విధానాలు మొదలయ్యాయి. ఈ ప్రభావం పెద్ద ఎత్తున సాంకేతిక, నైపుణ్య రంగంపై పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాలను నెత్తికెత్తుకోవడం వల్ల సాంకేతిక, నైపుణ్య విద్యలో నాణ్యత తగ్గింది. కార్లు, సెల్‌ఫోన్లు వంటివి తయారు చేయడం మానేసి భారత దేశం దిగుమతులపై ఆధారపడటం మొదలైంది. కోట్ల రూపాయలు సమర్పించుకుని అమెరికా, జపాన్‌, జర్మనీ వంటి దేశాల నుంచి వస్తువులును దిగుమతి చేసుకుంటున్నారే తప్ప మన దేశంలో ఉన్న సాంకేతికతను అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కేంద్రానికి లేకుండా పోయింది. ఎప్పుడైతే దిగుమతిపై ఆధారపడ్డారో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే కృషి దెబ్బ తింది. ఈ రంగాల్లో పరిశోధన దాదాపు లేకుండా పోయింది. ఇంకో పక్క తయారీ విధానం దెబ్బ తింది. ఫలితంగా దేశంలో మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో పని లేకపోవడంతో చాలా మంది ఐటిఐ, ఇంజినీరింగ్‌, ఐఐటి, పాలిటెక్నిక్‌ చదువుకున్న వారు నిరుద్యోగులుగా మారిపోతున్నారు.
క్రమేపీ ప్రాధాన్యత తగ్గించారు
1970 నుంచి 1990 వరకూ సాంకేతిక, నైపుణ్య విద్యకు ప్రాధాన్యత ఉండేది. ఏ ఐటిఐలో చేరాలన్నా సీట్లు దొరికేవి కావు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనికి కారణం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పాటించకపోవడమే. కేంద్రంతో పాటు అప్పటి సిఎంలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సైతం ఈ విధానాలను తలకెత్తుకున్నారు. జగన్‌ హాయాం లోనూ అదే విధానాలు. ఎప్పుడైతే సాంకేతిక విద్యను, నైపుణ్యాన్ని ఆధునీకరించడంపై శ్రద్ధ తగ్గిందో అప్పటి నుంచి మన ఐటిఐలు మూలపడ్డాయి. పాతకాలపు కోర్సులు, కాలం చెల్లిన ఎక్విప్‌మెంటు, పురాతన శిక్షణా పద్ధతులు, ప్రభుత్వ నిధులు లేకపోవడం వాటిని మరింత కుంగదీశాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో పరిశీలించకుండా స్వంత, దేశీయ టెక్నాలజీని పెంపొందించుకునే దిశగా కొత్త విధానాలను చేపట్టకుండా, పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వకుండా ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఐటిఐ నిర్మిస్తామని చెబుతున్నారు. ఉన్నవాటిల్లోనే ల్యాబ్‌లు లేవు. సరిపడా అధ్యాపకులు లేరు. భవనాలు లేవు. వీటిపై దృష్టి పెట్టకుండా కొత్త కోర్సులు తెచ్చేస్తాం. కొత్త ఐటిఐలు కట్టేస్తామని గొప్పలు చెప్పుకోవడం వృధా ప్రయాసే. ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను విడిచి పెడితే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించలేరన్న విషయాన్ని గమనించాలి.
కొరవడిన సామాజిక న్యాయం
ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి అప్పచెప్తున్నాయి. ఈ ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయదు. ఫలితంగా సామాజిక న్యాయం దెబ్బతింటోంది. సాంకేతిక విద్యను అభ్యసించి వెనుకబాటుతనం నుంచి బైట పడాలనుకునే దళిత, గిరిజన యువతకు ప్రైవేటీకరణ గొడ్డలిపెట్టు అయింది. ఉదాహరణకు విశాఖపట్నం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏటా గిరిజన విద్యార్థులు నైపుణ్య విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాలు సంపాదించేవారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి పిల్లలు కూడా చాలా మంది ఐటిఐ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ చదువులు పూర్తి చేశారు. కానీ వారికి ఉద్యోగాలు లేవు. కనీసం రాష్ట్ర పరిధిలోనైనా ప్రైవేటు రంగం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా జగన్‌ ప్రభుత్వం యోచన చేయాలి.
 

ఉన్న దానిలో కేంద్రం పెత్తనం
ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యం అంతంత మాత్రంగా ఉంటే ఉన్న దానిపై కేంద్రం పెత్తనం చేస్తోంది. ఐటిఐలో ఆధునిక కోర్సుల ఎంపికను తన చేతిలో పెట్టుకుని మొండిగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు, పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, సిలబస్‌ రూపొందించుకోవాలంటే కచ్చితంగా రాష్ట్రంలో ఒక బోర్డును ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి బోర్డు లేదు. ఫలితంగా ఏ కోర్సులు పెట్టాలో తేల్చుకునే స్వేచ్ఛ రాష్ట్రానికి లేకుండా కేంద్రమే తనకు నచ్చిన కోర్సులను విద్యార్థులపై రుద్దుతోంది. కాగా గత రెండేళ్లగా ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు పెడుతోంది. ఐటిఐ చేసిన వారిలో ఎక్కువ మంది 8, 10, 12 తరగతులు చదివిన వారే ఉంటారు. వీరికి కంప్యూటర్‌పై అంత పరిజ్ఞానం ఉండదు. ఐటిఐలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ల్యాబ్‌లు ఉండాలి. సగానికిపైగా ఐటిఐ కళాశాలల్లో ల్యాబ్‌లు, బోధనా సిబ్బంది లేరు. ఉన్న బోధనా సిబ్బందిలో కూడా చాలా మంది కంప్యూటర్‌పై శిక్షణ ఇవ్వడం లేదు. అలాంటి సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు రాయడం సాధ్యమవుతుందా? రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పరీక్షలు వద్దని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా గతేడాది పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది కూడా అక్టోబర్‌లో పరీక్షలకు సిద్ధమవుతోంది.
 

రాష్ట్ర ప్రభుత్వానిదీ చిన్న చూపే
''ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక ఐటిఐ ఉండేలా చర్యలు తీసుకోండి. ప్రభుత్వ ఐటిఐల్లో అవసరమైన టీచింగ్‌ స్టాఫ్‌ను పెట్టండి. ప్రతి మూడు నెలలకొకసారి పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై ఉద్యోగవకాశాలపై మాట్లాడండి. శిక్షణ పొందిన వారికి అప్రెంటిస్‌ షిప్‌ వచ్చేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోండి. తక్షణమే విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయండి...'' ఇవి సి.ఎం. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులతో చెప్పిన మాటలు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. సిఎం ఆదేశాలన్నీ సమావేశాలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి నైపుణ్యంపై ప్రభుత్వం దృష్టే పెట్టడం లేదు. కనీసం పరిశ్రమలతో సమన్వయం కూడా చేయడం లేదు. ఐటిఐలలో శిక్షణ ఇచ్చేందుకు కూడా అధ్యాపకులు లేరంటే ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
    రాష్ట్రంలో 80 ప్రభుత్వ ఐటిఐలు 430 ప్రయివేటు ఐటిఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటిఐలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ కలిపి 2,782 పోస్టులకు గాను 1,579 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా 1,070 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇన్ని పోస్టులు ఖాళీ ఉంటే శిక్షణ ఎలా సాధ్యమవుతుంది? కొన్ని చోట్ల భవనాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరికొన్ని చోట్ల కరెంటు బిల్లులూ కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ ఐటిఐలలో మెషినరీ కొనుగోళ్లకు వరల్డ్‌ బ్యాంకు నుంచి నిధులు తెచ్చినా ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగలేదు. ముఖ్యంగా శిక్షణా కాలంలో ప్రాక్టికల్స్‌ ఖర్చు నిమిత్తం ఒక్కో విద్యార్థికి రూ.400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. వాస్తవానికి ఐటిఐ శిక్షణ పూర్తయిన తరువాత పరిశ్రమలతో ప్రభుత్వమే సమన్వయం చేసుకుని ఒక ఏడాది కాలం పరిశ్రమల్లో విద్యార్థులకు అప్రెంటిస్‌ షిప్‌ ఇప్పించాలి. కానీ ప్రస్తుతం ఎక్కడా అది జరగడం లేదు.
 

ఏడాదికి 52 వేల మందికి శిక్షణ
రాష్ట్రంలో ఏడాదికి సుమారు 52 వేల మంది ఐటిఐలో శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వీరిలో వందల సంఖ్యలో విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదీనంలో ఉన్న నేవల్‌ డాక్‌యార్డ్‌, స్టీల్‌ప్లాంట్‌ వంటి భారీ పరిశ్రమల్లో అరకొర అవకాశాలు ఇస్తున్నారు. కరోనా దెబ్బతో చాలా మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. ఉన్న చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో ఐటిఐ విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అవకాశాలు కల్పించడం లేదు. ఆన్‌ ది జాబ్‌ ట్రైనింగ్‌ పేరిట శిక్షణ సమయంలోనే పరిశ్రమలకు పంపించాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. ఇండిస్టీస్‌ ఇంటర్‌ ఫేస్‌లో భాగంగా పరిశ్రమలతో కలిసే శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. ఇంటర్నెట్‌ ఆపరేషన్‌, లిఫ్టు మెకానిజం వంటి 8 రకాల కొత్త ట్రేడ్‌లను పెట్టమని కేంద్రం ఆదేశించినా ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వాటిలో శిక్షణ ఇవ్వడం లేదు. ముఖ్యంగా కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ ఐటిఐలలో శిక్షణ ఇవ్వడం లేదు. ఐటిఐ ని పట్టించుకోని ప్రభుత్వం 30 శాతం సీట్ల అమ్మకానికి మాత్రం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
 

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ అధ్యాపకుల పరిస్థితి దారుణం
ప్రభుత్వ ఐటిఐలలో పనిచేస్తోన్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి దారుణంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఐటిఐలలో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 431 మంది అధ్యాపకులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సి.ఎం అయి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ వారిని రెగ్యులర్‌ చేయలేదు. వీరికిచ్చే జీతాలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. గతంలో ఏడాదికి ఒకసారి ఈ 431 పోస్టులను పొడిగించేవారు. ఇప్పుడు ఆరు నెలలకోసారి పొడిగిస్తున్నారు. ఈ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడానికి రెండు మూడు నెలలు సమయం తీసుకుంటున్నారు. ఈ కాలానికి వారికి వేతనాలు ఉండటం లేదని గతం మాదిరిగానే ఏడాదికి ఒకసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ అధ్యాపకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ఐటిఐ కళాశాలల్లో సమస్యలపై...ఈ నెల 22న ప్రభుత్వ ఐటిఐ అసోసియేషన్‌ స్టేట్‌ కాన్ఫరెన్స్‌...విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉండే కోర్సులు తీసుకొచ్చేలా, కోర్సుల ఎంపిక, నిర్వహణకు బోర్డు ఏర్పాటు చేసేలా, పరిశ్రమల్లో ఐటిఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేలా సరైన సూచనలు, ప్రతిపాదనలు రూపొందించి ఇకనైనా వీటిని బాధ్యతగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం అవసరం.

మహంతి రాజారావు
వ్యాసకర్త సెల్‌ : 9440014865