May 15,2022 09:54


అపోసైనేసి కుటుంబంలోని పుష్పించే మొక్కలజాతి అడెనియం. ఇవి ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పానికి చెందినవి. నక్షత్రాల్లాంటి పువ్వులు, దృఢమైన కాండంతో అద్భుతమైన కళాకాండాల్లా ఉంటాయి. నాలుగడుగుల ఎత్తు వరకూ పెరగగలిగే అడెనియం ఎన్నాళ్లు నీళ్లు లేకపోయినా తట్టుకోగలవు. వీటి వేరువ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. కుండీల్లో పెంచుకుంటే దానిలోని మట్టిని కొన్నేళ్లకు వేర్లు కాండంగా మార్చేసుకుంటాయి. ఎంతో అందంగా ఉండే ఇవి ఎన్నో ఆకారాల్లో, వివిధ రంగుల్లో పువ్వులు పూస్తాయి. ఇంకెన్నో పరిమాణాల్లో కొలువుదీరే రకరకాల మొక్కలున్నాయి.

అన్నిరకాల వాతావరణాలు తట్టుకోగలిగే ఈ మొక్కల్లో ఇండోర్‌, అవుట్‌ డోర్‌, సెమీ షేడుల్లో పెరిగే మొక్కలున్నాయి. మొత్తానికి ఈ మొక్కలు చూడచక్కని కళాకాండాలుగా కనువిందు చేస్తాయి. ఒకప్పుడు వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడే కడియం నర్సరీల్లో భారీఎత్తున ఉత్పత్తి చేయడంతో అందుబాటు ధరలకే దొరుకుతున్నాయి.
ఎలా మలిస్తే? అలా!
అడెనియం మొక్కలు సహజంగానే వివిధ ఆకారాల్లో కొలువుదీరి, చూడ్డానికి కళాకృతుల్లా కనిపిస్తాయి. వాటి కొమ్మలు మలిచి, రెమ్మలు దూసి, నగిషీల్లా మలిస్తే అత్యద్భుత వనశిల్పాలౌతున్నాయి. నర్సరీ శిల్పులు ఒక ప్రత్యేకమైన అల్యూమినియం తీగతో వీటి ఆకారాలకు ప్రాకారాలు అద్దుతారు. కొన్నాళ్ళకు మొక్క కావాల్సిన రూపాన్ని తొడుక్కుంటుంది. అందుకే ఈ మొక్కల్ని బోన్సారు మొక్కలుగా తయారుచేస్తారు.

డీర్‌ ప్లాంట్స్‌
జింకల కొమ్ములతో పరుగులు తీసినట్లు చూడచక్కగా ఉండే ఈ మొక్కలను డీర్‌ అడెనియం మొక్కలు అంటారు. మానులు అచ్చంగా దుప్పి ముఖాల్లాగా, పువ్వులు పూసిన కొమ్మలు వడితిరిగిన వాటి కొమ్ముల్లాగా ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని ప్రత్యేక కుండీల్లో పెంచి, పదుల సంఖ్యలో అలంకరించుకుంటే ఇంటికి భలే శోభ వస్తుంది.

ఏనుగు తొండం


ఏనుగు తొండం
ఏనుగు తలభాగం వంకర్లు తిరిగిన తొండంతో ఒక పుష్పగుచ్ఛాన్ని పట్టుకుని స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. ఆకులు పువ్వులతో చివరల ఎంతో అందంగా ఉంటుంది.
 

రూట్స్‌


రూట్స్‌
మొక్క వేరులన్నీ కట్టకట్టుకుని గుంపుగా కాండంగా రూపాంతరం చెంది పైభాగంలో కొమ్మలు, ఆకులు, పువ్వులతో అలరిస్తుంది. మర్రిచెట్టు చుట్టూతా ఊడలు విస్తరించుకుని ఏళ్ళ తరువాత ఊడలు మొదలులో మమేకమైనట్లు ఉంటుందీ మొక్క.

డైనోసార్‌


డైనోసార్‌
మొక్క మొదలుభాగం అంతా డైనోసార్‌లా ఉంటుంది. తలమీద చిన్ని కొమ్మ విచ్చుకుని అప్పుడప్పుడూ పూలు పూస్తుంది. ఇలాంటి మొక్కలను గ్రాఫ్టింగ్‌ ద్వారా తయారుచేస్తారు.
 

బంతి


బంతి
మొక్క కాండము బంతి ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. పైన కొమ్మలు, ఆకులతో పువ్వులు పూస్తుంటాయి. వయస్సు పెరిగేకొద్దీ బాల్‌సైజు పెరుగుతూ ఉంటుంది. కుండీల్లో పెరిగే ఈ మొక్క మొదలు మట్టిపైన చలువరాతి ముక్కలు పేరిస్తే ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం.. చూడాల్సిందే!

రోప్‌ ప్లాంట్‌


రోప్‌ ప్లాంట్‌
తాడును అల్లినట్లుగా గొలుసుకట్టుగా మూడు లేదా అంతకంటే ఎక్కువ మొక్కలు పెనవేసుకుని పెరుగుతుంటాయి. తలభాగంలో కొమ్మలు, ఆకులు, పువ్వులతో చక్కగా విచ్చుకుని అందంగా అలరిస్తాయి.

కంగారు మొక్క


కంగారు మొక్క
కంగారు జంతువు పొట్టసంచిలో దాని పిల్లను పెట్టుకుని, కూర్చుని ఆహారం కోసం వెతుకుతున్నట్టు ఉంటుంది ఈ మొక్క. తలభాగంలో గులాబీ, తెలుపు రంగుల కలబోతతో పువ్వులు రమణీయంగా విప్పారి, కనువిందు చేస్తాయి.
 

మత్స్య కన్య

మత్స్య కన్య
మనం అరుదుగా చూసే అపురూప కళాకాండం మత్స్యకన్య. ఈ మొక్క అచ్చంగా అలానే ఉంటుంది. ముఖభాగంలో పువ్వులు గుభాళిస్తాయి.

 వలపు విరివనం


వలపు విరివనం
ఈ మొక్క భలే గమ్మత్తుగా ఉంటుంది. దేవాలయాల మీద శిల్పాలు మాదిరిగా స్త్రీ, పురుష వలపుల విరుపులా ఉంటుందీ మొక్క. దీన్ని ఇతర దేశాల్లో రొమాంటిక్‌ ప్లాంట్‌ అంటారు. అక్కడ వీటికి మంచి గిరాకీ ఉంది. వీటి కాండాలకు, కొమ్మలకు బార్బీబొమ్మల తలలు, జంతువుల బొమ్మల తలలు అలంకరించి, కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటారు వనప్రియులు.

- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506