- రెండో రోజూ ఆద్యంతర ఆకట్టుకున్న అమరావతి బాలోత్సవం
ప్రజాశక్తి-వన్‌టౌన్: కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అమరావతి బాలోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్లో జోష్‌ను నింపాయి. రెండో రోజు సోమవారం 3,600 మంది విద్యార్థినీ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ విభాగంలో జానపద నృత్యాలు, జానపద గీతాలాపన, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, క్లాసికల్ డాన్స్, లఘు నాటికల్లో చిన్నారులు పాల్గొని అలరించారు. అలాగే సైన్సు ఎగ్జిబిషన్‌లో జూనియర్స్, సీనియర్స్, కార్టూన్‌లో జూనియర్స్, చిత్రలేఖనంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మెమొరి టెస్ట్‌కు సబ్ జూనియర్స్, జూనియర్స్, కథా రచనలో జూనియర్స్, వ్యాసరచన (తెలుగు), జూనియర్స్, సీనియర్స్, వ్యాసరచన (ఇంగ్లీష్), స్పెల్ బి, మాప్ పోటీలలో జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఆద్యంతం ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
బాలోత్సవంలో రెండో రోజు వివిధ సాంస్కృతికాంశాల్లో పోటీలు జరిగాయి. 'నేలమ్మ నేలమ్మ నీకు వేలు వేలు వందనాలమ్మ', 'కొండ కోనల్ల నడుమ మల్లెలు', రైతు రైతు రైతో అరుగాలం కష్టించే రైతు అంటూ పిల్లలు చేసిన జానపద నృత్యాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ''ముద్దుగారే యశోద'', ''వచ్చేను అలివేలు మంగ'', ''తాండవ నృత్యగరీ'', శివాష్టకం, భావములోన భాగ్యములోన'', ''దశావతారాలు'' వంటి శాస్త్రీయ నృత్యాల పాటలతో చిన్నారులు అద్బుతంగా చూపరులను ఆకట్టుకున్నారు. జాపనద గీతాలాపనలు, దేశభక్తి గాతాలాపనలు మంత్ర ముగ్ధులను చేశాయి. కృష్ణలంక సాయి పబ్లిక్ స్కూల్‌కు చెందిన చిన్నారులు 'కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులపై' లఘునాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు, అలాగే మొగల్రాజపురంలోని రిజోనెన్స్ స్కూల్‌కు చెందిన చిన్నారులు యుద్ధంలో సైనికుల వ్యవహార తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.
అద్భుతం సైన్స్ ఎగ్జిబిషన్
జూనియర్స్, సీనియర్స్ విభాగంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. గన్నవరం స్రవంతి హైస్కూల్‌కు చెందిన జయ ఆదిత్య విద్యార్థి ''హైడ్రాలిక్ ఫుట్‌పాత్'' పరికరాన్ని తీర్చిదిద్దాడు. హైడ్రాలిక్ ట్రీ షిఫ్ట్ మెషిన్‌ను నూజివీడు కుమార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన సిహెచ్.హాసిని ప్రదర్శించి అబ్బురపరిచింది. గుంటుపల్లి సెయింట్ ఆన్స్ స్కూల్‌కు చెందిన చిన్నారి ఖాజా జియావుద్దీన్ ఏటిఎం మిషన్ నమూనా తయారు చేసి ఆకట్టుకున్నాడు. చిత్రలేఖనంలో జూనియర్, సీనియర్స్ సుమారు 650 మంది పాల్గొని పలు రకాల చిత్రాలను గీశారు. కార్టూన్ గీయటంలోను సత్తా చాటుకున్నారు. ఈ కార్యక్రమాలను బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, అధ్యక్షులు ఎస్.పి.రామరాజు, బాలోత్సవాల రాష్ట్ర సమన్వయకర్త పి.మురళీకృష్ణ, జి.జోత్స్య, పారిశ్రామిక వేత్త బాయన వెంకటరావు, గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, కె. వెంకట్, ఎ.వి.రామరాజు పర్యవేక్షించారు.










