ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు పద్యం బాపట్ల జిల్లాలోనే పురుడు పోసుకోవడం జిల్లా వాసులందరికీ గర్వకారణమని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. మంగళవారం తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో నెలకొల్పిన అద్దంకి పద్య శాసనాన్ని జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుకు కావ్య భాష హౌదా కల్పించిన అద్దంకి పద్య శాసనం బాపట్ల జిల్లా కీర్తిని చాటుతోందని అన్నారు. తెలుగు భాషా సాహిత్య ప్రాచీనతకు ఈ శాసనం అద్ధం పడుతోందన్నారు. తెలుగు పద్య మహాసౌధానికి పునాదిరాళ్లు మోసినవారు బాపట్ల జిల్లావాసులు కావడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు పద్యాన్ని శాసనాలకెక్కించిన కవులు తొమ్మిదో శతాబ్దంలోనే బాపట్ల జిల్లాలో ఉండటం చారిత్రాత్మక ఘట్టమన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ కె లక్ష్మి శివజ్యోతి, ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, చిత్రకారుడు జీవి, సాహితీవేత్తలు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.










