ప్రజాశక్తి-అద్దంకి: ఆర్టీసి పరిరక్షణ వారోత్సవం, అద్దంకి ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు అద్దంకి డిపోలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో డి గంగాధర్ అధ్యక్షతన ఆర్టీసి రక్షణ కోసం నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన ప్రజల డబ్బుతో సమకూర్చిన ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ చర్యలను, ఉద్యోగ, కార్మికులతో ప్రజలంతా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బస్టాండులను ప్రైవేటు వారికి అప్పనంగా ఇచ్చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని తాము ఏ మాత్రం ఒప్పుకోనేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నానికి సోదర సంఘాలు కలిసి రావాలని కోరారు. 2017 ఆర్‌పిఎస్ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, బకాయి ఉన్న డిఏలు వెంటనే చెల్లించాలని, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని కోరారు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులకు ఇచ్చే రాయితీని నేరుగా ఆర్టీసికి చెల్లించాలని, ఎన్‌క్యాష్‌మెంటు వెంటనే చెల్లించాలని, కార్మికులకు రావలసిన వివిధ అలవెన్సులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతిరెడ్డి, డిఏవి సుబ్బారావు, ఏఎల్‌ఎన్ రెడ్డి, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.










