
ప్రజాశక్తి-గుంటూరు : కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు కె.నళినీకాంత్, కె.మాల్యాద్రి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరశిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక గుజ్జనగుండ్ల సెంటర్‌లో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తుతూ, కేంద్రం చేస్తున్న నిర్ణయాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా కరెంటు ఛార్జీలు పెంచుతోందని విమర్శించారు. వినియోగించిన కరెంటుకు వసూలు చేస్తున్న బిల్లులే కాకుండా, ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, సర్ చార్జీలు, విద్యుత్ సుంకం, ఇంధనం చార్జీలు, సర్దుబాటు చార్జీలు ఇలా రకరకాల పేర్లు పెట్టి జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరుగుబాటు సమయం ఆసన్నమైందన్నారు. గత ప్రభుత్వాలు కరెంటు చార్జీల పెంచడం ద్వారా అధికారాన్ని దూరం చేసిన ఈ ప్రజలు ఇప్పుడు ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సంసిద్ధమవుతున్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎస్.హనుమంత్‌రెడ్డి, ఎన్.చిన్న, పి.శివాజీ, కె.రంగారెడ్డి, సిపిఎం నాయకులు షేక్ ఖాశిం షహీద్, ఆది నికల్సన్, షేక్ బాషా, షేక్ ఖాశింవలి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఛార్జీలతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, బిల్లులు చూడగానే ప్రజలకు షాక్ కొడుతోందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య అన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) తదితర వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక మిద్దె సెంటర్లో శనివారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెంగయ్య మాట్లాడుతూ రెండు గంటల పాటు నిర్వహించిన కార్యక్రమంలో 210 ఓట్లు పోలవ్వగా 209 ఓట్లు కరెంట్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వచ్చినట్లు వెల్లడించారు. రూ.500-600 కరెంటు బిల్లును ప్రజలు ఎలా కట్టగలరంటూ ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రశ్నించిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు పేరుతో భారీగా భరాలు వేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబట్టేందుకు చూస్తున్నారని, రాష్ట్రాన్ని అదానీలాంటి కార్పొరేటర్లకు తాకట్టు పెడుతూ ప్రజలపై పెనుబారాల మోపుతున్నారని, ఆ కంపెనీలతో కుమ్మక్కై విద్యుత్‌ను యూనిట్ బహిరంగ మార్కెట్లో రూ.10 నుండి రూ.20కు కొంటున్నారని దుయ్యబట్టారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నితిరుపతయ్య మాట్లాడుతూ 200 యూనిట్లులోపు విద్యుత్ వాడే వారందరికీ ఉచిత విద్యుత్‌ను ఇస్తామని చెప్పిన జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ క్రమంగా నీరుగారుస్తున్నారని, చిరు వ్యాపారులకు విపరీతంగా రేట్లు పెంచారని, వ్యాపార సంస్థలు పరిశ్రమలపై భారం పెరిగిందని అన్నారు. ఈ భారాలను రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై.వెంకటేశ్వరరావు, ఎ.ప్రభాకర్, ఎన్.బ్రహ్మేశ్వరరావు, పి,నాగేశ్వరరావు, జె.జాన్‌బాబు, జె.సాంబశివరావు, జి.సాంబిరెడ్డి, చిన్ని సత్యనారాయణ, ఎస్‌కె.కరీముల్లా, బి.శ్రీనివాసరావు, వై.శివగోపి, ఎం.అభిషేక్, ఎ.హనోక్‌బాబు, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, ఎం.ఫకీరయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్, నాయకులు ఎం.బాలాజీ, ఎం.చలపతిరావు, డి.రామారావు, సిపిఐ (ఎంఎల్) నాయకులు కె.కోటేశ్వరరావు, ఆదినారాయణ, దుర్గాప్రసాద్, అంజిరెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు.