Aug 01,2023 00:11

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టును అదాని సంస్థ అడ్డగోలుగా కొనుగోలు చేసిందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు విమర్శించారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలు సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, గంగవరం పోర్టు నిర్మాణంలో అప్పటి ప్రభుత్వం అడ్డుదారుల్లో స్టీల్‌ప్లాంట్‌ భూమిని లాక్కొని, మత్స్యకారులను ఖాళీ చేయించి నిర్మించారని తెలిపారు. పోర్టులో ప్రభుత్వ వాటా 10.4 శాతం ఉండగా దాన్ని కూడా అదానీకి కట్టబెట్టేశారని విమర్శించారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌కు వచ్చిన రా మెటీరియల్‌ను అన్‌లోడింగ్‌ చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదాని గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, విజయం సాధించేవరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇటు గంగవరం పోర్టు నిర్వాసితులు, ఆటు స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు పోర్టును దిగ్బంధం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పోరాటం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఈ పోరాటానికి సిఐటియు అండగా నిలుస్తుందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, యు.రామస్వామి వైటి.దాసు హాజరై గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, శ్రీనివాసరాజు, కొవిరి అప్పలరాజు, గంగవరం పోర్టు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు, వాసుపిల్లి ఎల్లాజి, గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, కదిరి సత్యానందం, గంటిపల్లి లక్ష్మయ్య, నొల్లి స్వామి, కొవిరి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.