
ప్రజాశక్తి - భోగాపురం : ప్రభుత్వం రిజర్వ్ చేసిన భూముల్లో నుంచి తమ లేఅవుట్ కు అడ్డుగోలుగా నిర్మించిన రహదారిని రెవెన్యూ అధికారులు శనివారం పరిశీలించారు. దీనిపై పూర్తి నివేదికను ఇవ్వాలని ఆర్.ఐ కిషోర్‌కు తహశీల్దారు ఆదేశించారు. ప్రభుత్వ అట్టిపెట్టుకున్న భూముల్లో నుంచి మండలంలోని ఒక రిసార్ట్ సంస్థ ఎటువంటి అనుమతులూ లేకుండా గ్రావెల్ రహదారిని 40మీటర్లు వెడల్పున సుమారు 3కిలోమీటర్లు తమ లేఅవుట్‌కు వెళ్లేందుకు సొంత యంత్రాలతో నిర్మించుకున్నారు. దీనిపై ప్రజాశక్తి పేపర్‌లో విమానాశ్రయ అదనపు భూముల్లో అడ్డగోలుగా రహదారి అనే ప్రత్యేక కథనం వెలువడింది. దీనిపై తహశీల్దారు చింతాడ బంగార్రాజు స్పందించారు. దీంతో ఆర్.ఐ, విఆర్‌ఒ సంబంధిత రోడ్డును పరిశీలించారు. అంతేకాక రహదారిని ఏయే సర్వే నెంబర్లులో వేశారో గుర్తించి నివేదిక ఇవ్వనున్నారు. ఈ భూముల్లో నుంచి ఎయిర్‌పోర్ట్ అథారిటీ డెవలప్‌మెంటు కార్పోరేషన్ రహదారిని నిర్మించిదని నమ్మించేందుకు తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే వారి నిర్మించితే ఒక ప్రైవేటు లేఅవుట్‌కు రహదారిని వేయాల్సిన అవసరం ఏముందని పలువురు అంటున్నారు. కేవలం ఆ సంస్థ ఈ రహదారిని బీచ్ కారిడార్‌కి వెళ్తుందని చూపించి తమ ప్లాట్లును విక్రయించుకునేందుకేనని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా ప్రజల సొమ్ముతో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో నుంచి రహదారిని నిర్మించిన ఆ రిసార్ట్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.