ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండల కేంద్రమైన భట్టిప్రోలు 2వ సచివాలయానికి గత ఏడాదికాలంగా అద్దె చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని, జడ్పిటిసి తిరువీధుల ఉదయభాస్కరి కార్యాలయానికి తాళం వేశారు. అదే సచివాలయం పరిధిలో సోమవారం గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మెరుగు నాగార్జున పాల్గొన్నారు. సచివాలయానికి తాళం వేసి ఉండటాన్ని చూసి మంత్రి అవాక్కయ్యారు. గ్రామంలో నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగా రెండు రోజుల క్రితం జడ్పిటిసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికార వర్గం గోప్యంగా ఉంచడం గమనార్హం. సచివాలయాలు ఏర్పాటు చేసిన దగ్గర నుండి జడ్పిటిసి తన ఇంటిని కార్యాలయానికి అనుగుణంగా మార్చి అద్దె ప్రాతిపదికన అప్పగించారు. అయితే ప్రభుత్వం నుండి అందాల్సిన అద్దె చెల్లింపులు రాకపోవడంతో ఆ భారాన్ని పంచాయతీ భరిస్తుంది. కాగా గత ఏడాది కాలంగా రూ.లక్షన్నర వరకు అద్ది చెల్లింపు రావాల్సి ఉందని, సర్పంచిని ఎన్నిసార్లు అడిగినా బిల్లులు పెట్టడం లేదని జడ్పిటిసి ఆరోపించారు. మంత్రి వస్తున్న సమాచారం తెలిసే కార్యాలయానికి తాళం వేసినట్లు నాయకులు వ్యాఖ్యలు ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి అద్ది చెల్లింపులు చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులు ఏ విధంగా నిర్మిస్తుందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.










