
ప్రజాశక్తి - కాళ్ల
ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యమంటూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినా క్షేత్ర స్థాయిలో అటు ప్రజలకు, ఇటు ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. సచివాలయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 895 గ్రామ పంచాయతీలకు 1165 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రతి సచివాలయంలోనూ 11 మంది ఉద్యోగుల చొప్పున 10,505 మంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా 20,149 మంది వాలంటీర్లు ఉన్నారు. అయితే ఇంత మంది సిబ్బంది పనిచేస్తున్నా చాలాచోట్ల సచివాలయాలకు సొంత భవనాలు లేవు. కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇరుకైన భవనాలు, ఫర్నీచర్ కొరత, మహిళా ఉద్యోగులకు కనీసం వాష్ రూమ్‌లు కూడా లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలో గ్రామ సచివాలయాలు
మండలంలో 21 సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 14 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో ఏడు వివిధ దశల్లో ఉన్నాయి. బొండాడ, దొడ్డనపూడి-1, 2 గ్రామ సచివాలయాలు, ఎల్‌ఎన్.పురం, కోలనపల్లి, కాళ్ల-1, 2 గ్రామ సచివాలయాలు, కోపల్లె, ఏలూరుపాడు, జక్కరం, జువ్వలపాలెం గ్రామ సచివాలయాలు పూర్తయ్యాయి. ప్రాతాళ్లమెరక, మాలవానితిప్ప, బొండాడపేట గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయి ప్రారంభోత్సవాలు జరిగాయి.
కాళ్లలోని రెండు సచివాలయాలు అద్దె భవనాల్లోనే..
కాళ్లలోని రెండు సచివాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సచివాలయానికి నెలకు ఎనిమిది వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. కాళ్ల 1, 2 సచివాలయాలు, దొడ్డనపూడి గ్రామ సచివాలయం-2 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు 4 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. బిల్లులు రాకపోవడంతో సుమారు ఎనిమిది నెలల నుంచి అద్దె చెల్లించని పరిస్థితి నెలకొంది. పంచాయతీ నిధులు అద్దె చెల్లింపులకు వినియోగించడం పట్ల ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర వసతులు..
అద్దె భవనాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గ్రామ సచివాలయాల్లో సరైన మౌలిక వసతులు లేవు. దీంతో అరకొర వసతులతో సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఇరుకు గదులు కావడంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. కాళ్లలో పంచాయతీ భవనం లేకపోవడంతో సచివాలయంలోనే సర్పంచికి ఒక గదిని కేటాయించారు. అక్కడే పంచాయతీ కార్యదర్శి, విఆర్‌ఒ కూడా విధులు నిర్వహిస్తున్నారు. మూడు గదుల్లోనే ఉద్యోగులంతా సర్దుబాటు చేసుకుంటున్నారు. కాళ్లలో రెండో గ్రామ సచివాలయం పూర్తి కాకపోవడంతో అద్దె భవనంలోనే సేవలు సాగుతున్నాయి. దొడ్డనపూడి-2 గ్రామ సచివాలయం నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో అద్దె భవనంలో సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కోపల్లెలో చెట్టు కిందే విధులు..
కోపల్లె సచివాలయ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో బైర్రాజు భవనంలో ఒక గదిలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సరిపోకపోవడంతో చెట్టు కింద విధులు నిర్వహించాల్సి పరిస్థితి నెలకొంది.