ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆర్‌టిసిలో కొత్త బస్సులు రాకపోవడం, పాత బస్సులకు తరచూ మరమ్మతులు గురికావడంతో డ్రైవర్లకు బస్సు నడపటం కత్తిమీద సాముగా మారుతోంది. జిల్లాలో అధ్వాన రహదారులతో పలు మార్గాల్లో డ్రైవర్లు, ప్రయాణికులు నరక యాతన చూస్తున్నారు. 2020 జనవరి 1న ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉద్యోగులకు, ప్రయాణికులకు పెరిగిన సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డిపోల్లో సాంకేతిక సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేరాల్సిన బస్సుల్లో ప్రైవేటు డ్రైవర్లను వినియోగిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొత్త నియామకాలు లేవు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 100కి పైగా డ్రైవరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కండక్టర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది దాదాపు 600 మందివరకు ఖాళీలు ఉన్నాయి. మూడేళ్లుగా అద్దె బస్సులు పెంచేస్తున్నారు. ప్రస్తుతం 320 అద్దెబస్సులు ఉండగా 760 ఆర్‌టిసి బస్సులు ఉన్నాయి. గతంలో 1100 బస్సులు వరకు ఉండేవి. వీటిసంఖ్య క్రమంగా తగ్గుతూ 760కి వచ్చాయి. మొత్తం బస్సుల్లో మూడో వంతు అద్దె బస్సులు ఉంటున్నాయి. అద్దె బస్సులకు కూడా కిలో మీటర్ల లక్ష్యం తప్ప ప్రయాణికులు ఉన్నారా? లేదా? అనేది పట్టించుకోవడం లేదు. చాలా ప్రాంతాలకు రాత్రి వేళ సర్వీసులను రద్దు చేశారు.
అద్దె బస్సులతో ఆర్‌టిసికి సొంతంగా డ్రైవర్లు అవసరం లేకుండాపోయింది. టిమ్ సర్వీసులు, నాన్‌స్టాప్‌లను పెంచడం ద్వారా శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ల నియామకం నిలిపివేశారు. కేవలం నెలకు రూ.9 వేలతో యువతీ యువకులను తాత్కాలిక ప్రాతిపదికన కండక్టర్లును నియమిస్తున్నారు. ఆర్‌టిసి బస్సుల్లో సైతం శాశ్వత డ్రైవర్లు లేరు. ఆన్‌కాల్ డ్రైవర్లుగా అప్పటికప్పుడు ప్రైవేటు డ్రైవర్లను తీసుకుంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా వీరికి ఆర్‌టిసి బస్సులను అప్పగించడం, వీరికి ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో తెలియకపోవడంతో పలుమార్లు ఘర్షణలు జరుగుతున్నాయి. డిపోల్లోని గ్యారేజిల్లో టైర్ రీ ట్రేడింగ్ యూనిట్లలో సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. దీంతో కొన్ని బస్సులు తరచూ ప్రమాదాలకు గురిఅవుతున్నాయి.
ఆరేళ్లుగా ఆర్‌టిసిలో కొత్త బస్సులను కొనుగోలు చేయడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించడంలేదు. అత్యవసరంగా అప్పటికప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన కండక్టర్లు, డ్రైవర్లును నియమిస్తున్నారు. గుంటూరు- విజయవాడ, నర్సరావుపేట- గుంటూరు, చిలకలూరిపేట- గుంటూరు తదితర మార్గాల్లో నాన్ స్టాప్ సర్వీసులకు రూ.9 వేల వేతనంతో తాత్కాలిక సిబ్బందిని కండక్టర్లుగా నియమిస్తున్నారు. చాలా ప్రాంతాలకు బస్సు సర్వీసులు రద్దు చేశారు. గతంలో మండల కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు 10-15 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు ఉండేది. ఇప్పుడు కనీసం 30 నిముషాల నుండి గంటకు ఒక సర్వీసు చేశారు. గుంటూరు నుంచి అమరావతికి బస్సు లేదు. క్రోసూరు బస్సులే అమరావతి వారికి దిక్కయ్యాయి. గుంటూరు-తాడికొండ, ప్రత్తిపాడు, మేడికొండూరు, చెరుకుపల్లి, చేబ్రోలు, ఫిరంగిపురం ఇలా మండల కేంద్రాలకు ఎగువ పట్టణాలకు వెళ్లే బస్సులపైనే మండల కేంద్రం, పరిసర గ్రామాల ప్రజలు ఆధారపడాల్సి వస్తోంది. బస్సులు సకాలంలో రాక ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం అనేక గ్రామాలకు ఆర్‌టిసి బస్సులు వెళ్లని పరిస్థితి ఉండగా ఆయా గ్రామాల్లో ప్రధాన రవాణా సాధనంగా ప్రజలకు ఆటోలే దిక్కుగా మారాయి. కొన్ని మండల కేంద్రాలకు జీపులు, టాటా మ్యాజిక్‌లు ఎక్కువగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి.










