Oct 30,2023 20:55

వినతినిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- శృంగవరపుకోట : కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ అద్దె బస్సు కార్మికుల సమస్య పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్‌టిసి కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో పట్టణంలోని ఆర్‌టిసి డిపో మేనేజర్‌ కె రమేష్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మద్దిల రమణ మాట్లాడుతూ ఎస్‌కోట ఆర్‌టిసి డిపోలో కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తూన్నారని వీరికి ఎక్కడా లేని విధంగా ఆర్‌టిసి కార్మికులను 3 నుండి 50 వరకు ముక్క ముక్కలుగా విడగొట్టి వందల మందిని ప్రజా రవాణా సంస్థ అప్పగించిం దన్నారు. వీరికి కనీస వేతనాల జిఒలను సవరించకుండా పాత వాటినే అమలుచేస్తు న్నారన్నారు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలివ్వాలన్నారు. కొంతమంది కార్మికులకు 3 నుంచి 4 నెలల వరకు జీతాలు చెల్లించడం లేదన్నారు. మార్కెట్లలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, విద్యా, వైద్యం, కరెంటు బిల్లుల ఖర్చు భారీగా పెరుగుతున్నా యన్నారు. అయినప్పటికీ వీరికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. డిపోలో మహిళా లైంగిక వేధింపుల కమిటి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.