Nov 10,2022 00:14

లారీతో వచ్చిన ఇసుకను ట్రాక్టర్‌కు అన్‌లోడ్‌ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - యలమంచిలి
ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుకాసురులు ఏ మార్గంలో తమ ఇసుక అక్రమ వ్యాపారం సాగితే ఆ మార్గంలో కానిచ్చేస్తున్నారు. ఇలాగే నిర్మాణాల పేరుతో ఇసుక బుక్‌ చేసి, దానిని రప్పించి రిటైల్‌లో అధిక ధరకు అమ్మకాలు సాగిస్తున్న చీకటి కోణం బుధవారం వెలుగు చూసింది. ఇందులో రాజకీయ నాయకుల పేర్లు కూడా వాడుకోవడం విశేషం.
బుధవారం ఉదయం యలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా వ్యవసాయశాఖ ఎడి కార్యాలయం లో వ్యవసాయాధి కారుల సమావేశానికి విలేకర్లు హాజరయ్యారు. ఈ సమయంలో దొంగచాటుగా ఇసుక తరలిస్తున్న వైనాన్ని విలేకర్లు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఇసుక స్పెషల్‌ ఇన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిఐ జనార్ధన్‌కు తెలియజేయగా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు నేర స్థలానికి చేరుకున్నారు. ఇసుకతో వచ్చిన భారీ లారీ అనుమతులు, రిటైల్‌గా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ యజమాని రామలక్ష్మణ్‌ దగ్గర కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని, విచారణ పూర్తయ్యే వరకూ వాహనాలను అక్కడే ఉంచాలని ఆదేశించారు. ఇసుక లబ్ధిదారుల్ని స్టేషన్‌కు రప్పించి వారి వివరణ తీసుకుంటామని ఎస్‌ఐ చెప్పారు. గురువారం ఉదయం కేసు పూర్వాపరాలు విచారించి, తగిన నిర్ణయం తీసుకుంటామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐ జనార్ధన్‌ చెప్పారు. ఇక్కడ నిర్మాణదారుల పేరుతో ఇసుక బుక్‌ చేసి, దానిని ఖాళీ స్థలాల్లో నిల్వ చేసి రిటైల్‌గా ట్రాక్టర్లు, గోనె సంచులతో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన అధికారులను మేనేజ్‌ చేస్తూ తమ కార్య కలాపాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.