Apr 23,2022 06:13

'మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే' - నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెంబరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అనునిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించలేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మరణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజంలో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో, బంధుమిత్రుల ఒడిలో, ఇప్పుడు ఆసుపత్రుల్లో, ఎక్కడైనా సరే, ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ, పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళలకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధిస్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణమౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు.
హైదరాబాద్‌లో 'దిశ' ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారుణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు, దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటిలోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆ దిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు, చిన్నారులకు లెక్కే లేదు. దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపోతోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా, ఆటబొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విషసంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదకద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసుపత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాంగం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిందన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాంగం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారులకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైనవారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.