ప్రజాశక్తి-దుగ్గిరాల : స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ యార్డు అభివృద్ధి చెందుతున్నా నిర్వహణకు తగినంత సిబ్బంది లేక సతమతమవుతున్నారు. అకస్మాత్తుగా పసుపు ధరలు పెరగడంతో యార్డుకు మార్కెట్ ఫీజు రూపంలో రూ.1.07 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరం నాలుగు నెలల ఆదాయం కంటే సంవత్సరం నాలుగు నెలల కాలంలో రూ.22 లక్షలు అధికం. అయితే సిబ్బంది కొరత యార్డును వేధిస్తోంది. 42 మంది ప్రభుత్వ సిబ్బంది ఉండాల్సి ఉన్నా నలుగురే విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారిస్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. మరో 20 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు యార్డు పరిధిలోని నాలుగు చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహించడంతోపాటు యార్డులో నైట్ డ్యూటీలు, రెగ్యులేషన్ వీరే చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం యార్డులో ప్రతిరోజు 1500-2000 క్వింటాళ్ల పసుపు విక్రయాలు జరుగుతున్నాయి. పసుపు ధరలు ఇంకా పెరిగితే విక్రయాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో యార్డు నిర్వహణకు తగినంత సిబ్బందిని నియమించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.










