ఆదాయం ఫుల్.. వసతులు నిల్..
- అవుకు రిజిస్ట్రర్ కార్యాలయం నిర్మాణానికి 118 ఏళ్లు
- శిథిలావస్థలో భవనం
- మహిళలకు మరుగుదొడ్లు లేక అవస్థలు
- చెట్ల కింద కూర్చుంటున్న ప్రజలు
ప్రజాశక్తి - అవుకు
అవుకు సబ్ రిజిస్ట్రర్ కార్యాలయానికి ఆదాయం బాగా ఉన్నా ప్రజలకు, మహిళలకు కనీస వసతులు కల్పించడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయానికి అవుకు, కొలిమిగుండ్ల, సంజామల మండలాల ప్రజలు రిజిస్ట్రేషన్ నిమిత్తం ప్రతి రోజూ అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రజలు కూర్చోవడానికి కనీసం కుర్చీలు లేవు. మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయ మార్గాల్లో అధిక లాభం వచ్చేది ఒకటి రిజిస్ట్రర్ ఆఫీస్‌లు. అవుకు, కొలిమిగుండ్ల, సంజామల మండలాల ప్రజలు ఏదైనా స్థిరాస్థులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవుకు మండల కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంకు రావాలి. 1905 సంవత్సరంలో అవుకు పట్టణంలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయం ఆవరణం మొత్తం 74 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. కార్యాలయం నిర్మించి ఇప్పటికి 118 ఏళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ రిజిస్ట్రేషన్లకు వచ్చే మహిళలకు, పురుషులకు, వృద్ధులకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా వసతులను కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడు మండలాలకు చెందిన ప్రజలు నిత్యం అవుకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వందల మంది వచ్చి వెళుతూ ఉంటారు. ప్రజలు తమ స్థిర చరాస్తులు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉంటారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారికి కనీసం కూర్చోవడానికి వసతులు లేక చెట్లకిందే కూర్చోవాల్సిన దుస్థితి ఉంది. మహిళలు, వృద్ధుల ఇబ్బందులు చెప్పనలవి కావు. మహిళలకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కార్యాలయానికి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు వచ్చినప్పుడు ఈ విషయం పలుమార్లు విన్నవించారు. అయితే ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేదని ఆయా మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం ఆవరణలో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి వాటి మధ్యలోనే శిధిలమైన మూత్ర విసర్జన గదిలోకి మహిళలు వెళ్లలేక అనేక అవస్థలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనం పూర్తిగా శిధిలమైంది. ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం మొత్తం తడిసి ముద్దయి భవనం లోపలికి నీరు చేరి రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్లు, పత్రాలు తడిసిన ఘటనలు కోకొల్లలు. వర్షాల సమయంలో కార్యాలయంలో పనిచేసే సిబ్బంది భవనంపై పట్టాలను కప్పి నీరు భవనంలోకి రాకుండా నానా అవస్థలు పడుతుంటారు. ఇక్కడ పనిచేసే సబ్ రిజిస్ట్రార్లు నూతన భవనాన్ని నిర్మించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా ఇంతవరకు ఎటువంటి చలనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై శ్రద్ధ చూపి నూతన భవనాలను, ప్రజలకు, మహిళలకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మూడు మండలాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.
ఎలాంటి వసతులు లేవు
గొంగటి జగన్మోహన్ రెడ్డి, మెట్టుపల్లి గ్రామం. అవుకు మండలం.
పేరుకే సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం. కానీ ఇక్కడ ఎటువంటి వసతులు లవు. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా భవనం మొత్తం నీరు కారి డాక్యుమెంట్లు తడిసిపోతుంటాయి. అయినా ప్రభుత్వం నూతన భవనాలను నిర్మించకుండా కాలయాపన చేస్తుంది. రిజిస్ట్రేషన్లకు వచ్చే మహిళలు మరుగుదొడ్లకు వెళ్లాలంటే ఊరి బయటకు పోవాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం రూపురేఖలు మాత్రం మారడం లేదు.
భవనం శిథిలమైన మాట వాస్తవమే..
హాజీ మియా, సబ్ రిజిస్టర్. అవుకు.
ఈ కార్యాలయం 1905లో నిర్మించినది వాస్తవమే. భవనం పూర్తిగా శిథిలం కావడంతో ఈ సంవత్సరమే కొంతమేర మరమ్మతులు చేసి రంగులు కూడా వేయించాం. ఇక్కడ వసతులు లేవన్న మాట కూడా వాస్తవమే. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు తెలియజేశాం. కార్యాలయం 74 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. వసతులు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్థలం ఉంది. ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్పకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.










