Aug 28,2021 06:18

      విశాఖ ఉక్కుకు సమీపాన అత్యంత కీలకంగా ఉన్న గంగవరం పోర్టును అదానీ సంస్థకు సంపూర్ణంగా కట్టబెట్టడమంటే అనేక విధాల రాష్ట్రానికి చేటు చేయడమే. ఇప్పటికే ప్రయివేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల రీత్యా కూడా ఇది హానికరం. పారిశ్రామికవేత్త డివిఎస్‌ రాజు కుటుంబం ప్రమోటర్‌గా వ్యవహరించిన ఈ పోర్టులో వారికున్న ప్రధాన వాటా 58.1 శాతంతో పాటు, అమెరికాకు చెందిన వార్బర్గ్‌ పిన్‌కస్‌ ల్‌ఎల్‌సికి అనుబంధ సంస్థ విండీ లేక్‌సైడ్‌ షేర్‌ 31.5 శాతాన్ని అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎపిసెజ్‌) ఇది వరకే కొనుగోలు చేసింది. ఇక మిగిలిన 10.4 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది. అది కూడా లాగేసుకుంటే సంపూర్ణంగా గంగవరం పోర్టు అదానీ పోర్టుగా మార్చేసుకొని విశాఖను ఆక్టోపస్‌లా ఆక్రమించవచ్చన్న ఎత్తుగడతో రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూపు కొనుగోలు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పచ్చజెండా ఊపడంతో ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డు ఈ నెల 23న అదానీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అదానీ సంస్థ అడిగీ అడగంగానే వాటాల విక్రయానికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రోజుల వ్యవధిలోనే ఆమోదం తెలిపిందంటే..దాని వెనుక కేంద్ర పెద్దల ఒత్తిళ్లే ప్రధాన కారణమన్నది జనవాక్యం.
    ఒకవైపు తనే స్వయంగా ప్రభుత్వ రంగ సంస్థలను తన కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెడుతూ మరో వైపు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని ప్రభుత్వ సంస్థలనూ తెగనమ్మాల్సిందేనంటూ రాష్ట్రాల మెడపై మోడీ సర్కార్‌ కత్తి వేలాడ దీసి బెదిరింపులకు గురిచేస్తోంది. 'అప్పులు కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాల్సిందే. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలన్నా ఇదే మార్గం. ప్రయివేటీకరణ దూకుడు పెంచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని బహిరంగంగా ప్రకటించి తెగువ చూపే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తాం'..రాష్ట్ర ప్రభుత్వాలను తనదైన శైలిలో బెదిరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వినాశకర ఆదేశాలు ఇవి.
    ఈ బెదిరింపులకు తలొగ్గక ప్రతిఘటించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. అధిక స్థానాల్లో అచంచల విశ్వాసంతో ప్రజలు ఎన్నుకున్న పాలకులపై ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. కేంద్రాన్ని ప్రతిఘటించడంలో విశాల ప్రజా మద్దతు కూడగట్టి ఎదురొడ్డాలి. కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం సరిగ్గా ఇలాంటి ప్రతిఘటనే చూపి ఢిల్లీ పెద్దలకు చెమటలు పట్టించింది. తిరువనంతపురం విమానశ్రయాన్ని ఇదే అదానీ గ్రూపుకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల్లో సైతం సవాలు చేసింది. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి నిరసనలు చేపట్టింది. విమానాశ్రయాలపై పెత్తనం కేంద్రానిదే అయినా కూడా కేరళ ప్రభుత్వం ప్రతిఘటించి ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ అవసరాన్ని ప్రజలకు వివరించగలిగింది. ప్రజాస్వామ్య ప్రభుత్వమేదైనా చేయాల్సింది ఇదే కదా! కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్పిన ప్రతిదానికీ తలూపుతోంది. విద్యుత్‌, పురపాలక, విద్యా రంగాల్లో మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన వినాశకర సంస్కరణలన్నిటికీ రాష్ట్రం ప్రయోగశాలగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.
     రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, కంటైనర్లు ఇలా మౌలిక సదుపాయాలన్నిటినీ తన గుప్పిట్లో బంధిస్తున్న అదానీ కోరలకు గంగ'వరం' మరింత పదును పెట్టే ప్రమాదముంది. త్యాగాల పునాదులపై నిర్మించిన విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి ఒకవైపు మహోద్యమం సాగుతుంటే..ఆ ఉద్యమానికి మద్దతు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గంగవరం పోర్టును పూర్తిగా అదానీకి కట్టబెట్టేయడం దేనికి సంకేతం? విశాఖ ఉక్కుకు చేటు చేసే ప్రయివేటీకరణ ఇక్కడ మేలైపోతుందా? గంగవరం పోర్టు ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఇప్పటికే సున్నపురాయి ఎగుమతులపై అదానీ గ్రూపు ధరలు పెంచేసింది. ఇక ప్రభుత్వ వాటా కూడా స్వాధీనం అయిపోతే దానికి హద్దే ఉండదు. రాష్ట్రం శాశ్వతంగా ఆదాయాన్ని కోల్పోవాల్సిందే. ఇదివరకే కృష్ణపట్నం పోర్టు అదానీ వశమైంది. ఇలా మౌలిక సదుపాయాలన్నిటినీ ప్రయివేటు పరం చేస్తూ పోతే భావి తరాలకు మిగిలేదేమిటి? అదానీకి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాల విక్రయాన్ని నిలిపివేసి గంగ'వరా'న్ని నిలుపుకోవాలి.