ప్రజాశక్తి- గాజువాక : అదాని గంగవరం పోర్టు కార్మికులకు యాజమాన్యం తీవ్ర అన్యాయం చేస్తోందని సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు తెలిపారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ, గంగవరం పోర్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ యాజమాన్యం దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గంగవరం పోర్టు అంతర్జాతీయంగా వ్యాపారలావాదేవీలు జరుపుతూ రూ.కోట్లలో లాభాలను గడిస్తున్నా కార్మికులకు మాత్రం గంగవరం పోర్టు సాఫ్ట్ అండ్ ఎస్టాబ్లిస్‌మెంట్ ప్రకారం వేతనాలు చెల్లించడం దుర్మార్గం అన్నారు. వేతనాలు పెంచాలని కోరిన కార్మికులపై కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగాలు తొలగిస్తోందన్నారు. వేతనాల పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్న నిర్వాసిత కార్మికులపై ఆంక్షలు పెట్టి బెదిరిస్తోందన్నారు. గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ, అదాని గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సమస్యను జఠిలం చేస్తోందన్నారు. నిర్వాసిత కార్మికులకు కనీస జీతం రూ.36 వేలు ఇవ్వాలని, బేసిక్‌లో డిఎ మెర్జ్ చేసి కొత్త బేసిక్ రూ.22 వేలుగా ప్రకటించాలని డిమాండ్‌చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యేవరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి అన్నపూర్ణ, భారత్ బచావో జిల్లా కార్యదర్శి డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్, గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు, ట్రెజరర్ వాసుతిల్లి ఏల్లాజీ, ఉమ్మడి అప్పారావు, గంటపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, కదిరి సత్యానందం పేర్ల నూకరాజు, నోళ్లు స్వామి, గంటిపిల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










