Jul 11,2023 23:55

గాజువాకలో భిక్షాటన చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి -గాజువాక : అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు పాత గాజువాక జంక్షన్‌లో మంగళవారం మానవహారం నిర్వహించారు. అనంతరం కార్మికులు పాత గాజువాక జంక్షన్‌ నుంచి పెదగంట్యాడ వరకు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ, గంగవరం పోర్టు నిర్మాణం జరిగితే గంగవరం, దిబ్బపాలెం నిర్వాసితుల బతుకుల్లో వెలుగులు వస్తాయని ఆశించామని, కానీ వారిని పోర్టు యాజమాన్యం భిక్షగాళ్ళను చేసిందని ఎద్దేవా చేశారు. గంగవరం పోర్టు యాజమాన్యం మొండివైఖరి విడనాడాలని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు.
గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ, గంగవరం పోర్టు యాజమాన్యం మొండిగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. పోర్టు నిర్మాణం కోసం ఎంతో త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులు చాలీచాలని జీతభత్యాలతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని సంప్రదింపులు ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. సిఐటియు స్టీల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు మాట్లాడుతూ, వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు పోరాడుతుంటే యాజమాన్యం నోటీసులు ఇచ్చి బెదిరిస్తోందని తెలిపారు. గంగవరం పోర్టు యాజమాన్యం దుర్మార్గపు చర్యలకు ప్రతి చర్యగా కార్మికులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతుంటే ఒక రోజుకు 8 రోజులు వేతనం కట్‌ చేస్తామని యాజమాన్యం హెచ్చరిక నోటీసులు పంపించడం మానుకోవాలన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికులను మూకుమ్మడిగా విధులకు రాకుండా అడ్డుకోవడంతో నిరసనగా కార్మికులు విధులు బహిష్కరించారని తెలిపారు. కలెక్టర్‌ చెప్పిన సూచనలను కూడా యాజమాన్యం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యమం ఉధృతం అయితే జరిగే పరిణామాలకు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి ఎల్లాజీ, గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, పేర్ల నూకరాజు, కదిరి సత్యానందం, గంటిపిల్లి లక్ష్మయ్య, కొవిరి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.