Mar 16,2023 20:04

మాట్లాడుతున్న ఎం. నాగేశ్వర రావు, తదితరులు

ఆదాని కుంభకోణంపై విచారణ కమిటీ వేయాలి : సిపిఎం

ప్రజాశక్తి - నందికొట్కూరు

ఆదాని కుంభకోణంపై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై జాయింట్‌ పార్లమెంటు కమిటీ వేసి విచారణ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్‌ చేశౄరు. గురువారం నందికొట్కూరు సిపిఎం కార్యాలయంలో పార్టీ ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశం పి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని ఆస్తులు రూ.14 లక్షల కోట్లు పెరిగాయని వారు ఆరోపించారు. కరోనా వల్ల దేశంలోని కోట్లాదిమంది ప్రజలు ఉపాధి లేక ప్రజలు దివాలా తీస్తే.. ఆదాని మాత్రం కోట్ల ఆస్తులు పోగుపడ్డాయని అన్నారు. ఆదాని కుంభకోణంపై విచారణ చేయాలని దేశంలోని 18 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు 200 మంది ఢిల్లీ ఈడి కార్యాలయం దగ్గరికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లగా రెండు వేల మంది పోలీసులతో అడ్డుకోవడం విచారకరమన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడి, సిబిఐ దాడులు పెరిగాయని వారు ఆరోపించారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఆదాని కుంభకోణంపె విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కే భాస్కర్‌ రెడ్డి, పి ఫకీర్‌ సాహెబ్‌, టి గోపాలకృష్ణ, కే ఆంజనేయులు, నరసింహులు, ఏసన్న, నాగ స్వామి, ఈ.మధు, తదితరులు పాల్గొన్నారు.