ఆడబిడ్డ ఆ.. డబిడ్డనే మాట
ఇప్పుడు చెల్లుబాటుకాని చిల్లరనోటు
ఆడబిడ్డకు చీపురంటగట్టే
మన మెదళ్లకు తెలియదా!
చీపురే లేకుంటే శుభ్రతెక్కడని?
ఆడబిడ్డంటే
సమస్తాన్నీ లోపల దాచుకుంటూ
సమాజాన్ని భుజాలపై మోస్తున్న
భూదేవే కదా!
నీ నివాసానికి ఆడబిడ్డ కావాలి
నీ సంతానాభివృద్ధికి ఆడబిడ్డ కావాలి
నీతో పాలునీళ్లలా
కష్టసుఖాలను పంచుకోవడానికి
కావాల్సింది ఆడమనిషే గదా!
నేల దున్ని నాట్లు వేసి
పండించిన గింజల్ని బువ్వచేసి వడ్డించి
లోకానికి ప్రేమవుగ్గు
తాపుతున్న ప్రేమమూర్తిని
భ్రూణహత్యల మూర్ఖపు గాజుపెంకులతో
అండంలోనే తుంచేస్తే..!?
అమ్మాయిలెక్కడ దొరుకుతారు?
తనువూ మనువూ
పంచుకునే తల్లుల్ని కనడానికి
అమ్మలు లేని కాలం
ఆడబిడ్డలు లేని లోకం
మనుషులు మొలవని
ఎడారి భూమని
ఎప్పుడర్థమవుతుంది
మన వెర్రిమెదళ్లకు..??
పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162