- బిల్లును ఆమోదించిన ఇరాన్ పార్లమెంట్
టెహరాన్ : ఇస్లామిక్ డ్రెస్ నిబంధనలను ఉల్లంఘించిన మహిళలకు పదేళ్ళ వరకు జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం ఇరాన్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వ మీడియా తెలిపింది. ''సపోర్ట్ ఫర్ ది కల్చర్ ఆఫ్ హిజాబ్ అండ్ చాస్టిటీ' బిల్లును మూడేళ్ళ ట్రయల్ పీరియడ్‌తో ఇరాన్ పార్లమెంట్ ఆమోదించిందని అధికార ఇర్నా వార్తా సంస్థ తెలిపింది. గత ఏడాది సామూహికంగా ఆందోళనలు జరిగినప్పటి నుండి ఇరాన్‌లో మహిళలు డ్రస్ కోడ్‌ను ఉల్లంఘించడం బాగా ఎక్కువైంది. దీంతో అధికారులు, పోలీస్తు గస్తీ బృందాలు ఇటీవలి మాసాల్లో చర్యలను ముమ్మరం చేశారు. డ్రెస్ కోడ్‌ను నీరు గార్చిందనే కారణంతోనే 22ఏళ్ళ మాషా అమినిని అరెస్టు చేయగా, ఆమె కస్టడీలో వుంటుండగా మరణించింది. దాంతో ఇరాన్‌వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వందలాదిమంది మరణించారు. వీరిలో డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది కూడా వున్నారు. వేలాదిమంది అరెస్టయ్యారు. ముసాయిదా చట్టం ప్రకారం, తలకు స్కార్ఫ్‌ను ధరించకపోతే మహిళలకు ఐదు నుండి పదేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది.