Sep 21,2023 23:50

ప్రజాశక్తి - అచ్చంపేట : ఎస్‌బిఐలో పొలాన్ని తనఖా పెట్టిన రైతుకు రూ.10 లక్షల రుణం మంజూరైంది. దాన్ని తీసుకోవడానికి రైతు గురువారం బ్యాంకు వద్దకు వచ్చారు. అయితే రుణం నగదును ఖాతాలో జమ చేయాలంటే బీమా చెల్లించాల్సి ఉంటుందని, బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇందుకు రైతు అంగీకరించకపోవడంతో మేనేజర్‌ను కలవాలన్నారు. మేనేజర్‌ వద్దకు రైతు వెళ్లగా ఆయన లేకపోవడంతో రుణం తీసుకోకుండానే వెనుదిరిగారు. బ్యాంకులో బీమా పేరుతో జరుగుతున్న తంతుకు ఇదొక ఉదాహరణ.
రుణం పొందాలంటే బీమా తప్పనిసరి అని మండల కేంద్రమైన అచ్చంపేటలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మేనేజర్‌ నిబంధన పెడుతున్నారని ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముద్ర రుణాలు పొందేవారు బీమా చెల్లించాల్సిన అవసరం లేదనే ఆదేశాలనూ పాటించడం లేదని, రూ.15 వేల బీమా చెల్లిస్తేనే రుణమిస్తానంటూ మేనేజర్‌ ఖరాఖండిగా చెంబుదున్నారని లబ్ధిదార్లు మండిపడుతున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఆర్‌బిఐ నిబంధనలు అంటూ బుకాయిస్తున్నారని చెబుతున్నారు.
2014లో ఈ బ్యాంకులో డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులకు రుణాలిచ్చి అందులో నుండి రూ.25 వేలను బీమా సొమ్ముగా వసూలు చేశారు. దీనిపై రుణం పొందిన వారు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి ఇక్కడ సిబ్బందిని బదిలీ చేశారు. మళ్లీ ఆరు నెలలుగా బీమా తంతు కొనసాగుతోంది. వ్యవసాయ రుణాలు తీసుకుంటున్న రైతుల వద్ద నుండి కూడా ఇన్సూరెన్స్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోలేక బ్యాంకుకు వస్తుంటే ఇక్కడ బీమా పేరుతో వసూలు చేస్తున్నారని రైతులు అసహనానికి గురవుతున్నారు. అచ్చంపేటలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంకు శాఖలూ ఉన్నాయి. ఆయా బ్యాంకులలో బీమా ప్రీమియం రూ.వెయ్యి రెండు వేలలోపే నామమాత్రంగానే ఉండగా ఎస్‌బిఐలో మాత్రం రూ.రెండు లక్షలకు రూ.15 వేలు తీసుకుంటున్నారని ఖాతాదారులు చెబుతున్నారు. ఈ ప్రీమియం మొత్తంలో 30 శాతం కమీషన్‌ బ్యాంకు మేనేజర్‌కు వెళుతుందని, అందుకే ఒత్తిడి చేసి మరీ వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.