Aug 16,2023 23:26

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం
నూతన వీసీగా డాక్టర్‌ ఆర్‌ శారద జయలక్ష్మి దేవి
ప్రజాశక్తి - క్యాంపస్‌ :
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా డాక్టర్‌ ఆర్‌ శారద జయలక్ష్మి దేవి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. డాక్టర్‌ శారద జయలక్ష్మి దేవి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్లాంట్‌ పాథాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. విశ్వ విద్యాలయంలో 18 సంవత్సరాలు విభాగాధిపతిగా, 15 సంవత్సరాలు సీనియర్‌ ఆచార్యులుగా, యూనివర్సిటీ లైబ్రేరియన్‌ గా, వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యులుగా, బోధన, పరిశోధన రంగంలో 32 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఈమె పర్యవేక్షణలో 16 పీహెచ్డీ డిగ్రీలు, 25 ఎమ్మెల్సీ అగ్రికల్చరల్‌ ప్లాంట్‌ పాథాలజీ అండ్‌ ఎంటమాలజీ డిగ్రీలకు గైడెన్స్‌ అందించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గోల్డ్‌ మెడల్స్‌ లను తీసుకున్నారు. 2015 సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును, 2010 సంవత్సరంలో వర్సిటీలో ఉత్తమ అధ్యాపకురాలు అవార్డును తీసుకున్నారు. ఐ కార్‌ ఫెలోషిప్‌ గా సీనియర్‌ ఫెలోషిప్‌, జూనియర్‌ ఫెలోషిప్‌ అవార్డులను కూడా తీసుకున్నారు. ఈమె పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌ లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతిగా బాధ్యతలు తీసుకోనున్న డాక్టర్‌ ఆర్‌. శారదకు పలువురు వర్సిటీ అధికారులు, ఆచార్యులు, పరిశోధకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్సిటీలోని వివిధ కళాశాలల అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివద్ధి పథంలో నడిపించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు.