మాతృ దేవోభవ.. పితృ దేవోభవ... ఆచార్య దేవోభవ.. అన్నారు పెద్దలు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఆచార్యునిదే. నాలుగు గోడల మధ్య ఉన్నత సమాజాన్ని తీర్చిదిద్దే రూపశిల్పి గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చైతన్యశీలి గురువు. 'బండరాతిని శిల్పఖండముగ మలచి/ చెలువమ్ము గూర్చెడు శిల్పి రీతి/ కదలించి వీణ తీగలపైన రాగాలు/ పలికించు సంగీతపరుని భంగి/ జ్ఞానశూన్యపు చీకటి సంకటమ్ము/ గూడుకట్టిన చిన్నారి గుండెలందు/ చదువుదివ్వెలు వెలిగించి చక్కనైన/ తెలివినించు ఉపాధ్యాయకలననెంతు' అంటూ ఉపాధ్యాయుడిని అనేక రూపాలలో వర్ణిస్తారు వేముగంటి నరసింహాచార్యులు ఈ పద్యంలో. సమాజంలో మిగతావారికంటే ఉపాధ్యాయునికి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. వాస్తవానికి... రైతు పండిస్తే... కార్మికుడు సంపదను సృష్టిస్తాడు. ఈ క్రమంలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అలాగే, సంపద సృష్టికర్తలను సైతం తయారు చేసేవారు ఉపాధ్యాయులు. ఉన్నతమైన విలువలు, ఆదర్శాలు నేర్పుతూ వారిని తయారు చేస్తారు.
జాతీయోద్యమ కాలంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిన వారిలో ఉపాధ్యాయులు అనేకమంది వున్నారు. అటువంటి స్ఫూర్తి మళ్లీ దేశానికి కావాలి. ఈ భావన ఉపాధ్యాయుల్లోనూ కలగాలి. దేశానికి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులుగా వున్నవారు కూడా గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్నవారే. కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడం ఒక్కటే కాదు... సమాజాన్ని చైతన్యవంతం చేయడం ద్వారా అనేకమంది యువకులను ఉద్యమాల్లోకి తీసుకొచ్చారు. విద్యా సంస్థలను నెలకొల్పిన కందుకూరి, మహిళలు విద్య నేర్వాలని తొలిసారిగా గుర్తించిన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ వంటి వారు చదువుతోనే సమానత్వం అని చెప్పారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛా భావాలు పాదుకొల్పారు. చదువు చెప్పే ఉప్యాధ్యాయుడు సమాజాన్ని ముందుకు నడిపించగలడు. అర్థం చేసుకునే శక్తి, ఆత్మవిశ్వాసం కలిగించగలడు.
నేడు యావత్ ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోతోంది. కత్రిమ ప్రచారార్భాటంలో కొట్టుకుపోతూ... సమాజానికి ఏది మంచి? ఏది చెడు? అనేది నిర్ణయించుకునే విచక్షణా శక్తిని కోల్పోతోంది. శతాబ్దాల తరబడి సోదరులుగా కలిసిమెసిలి జీవించిన వారి మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టడంతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితికి నెట్టబడింది. ఇప్పుడు ఈ సమాజానికి చికిత్స కావాలి. తన చికిత్సతో ఈ సమాజంలో చైతన్య దీప్తిని వెలిగించగలిగిన వాడు ఉపాధ్యాయుడు.
సమాజంలో తమ పాత్ర ఏమిటో ఉపాధ్యాయులకు అర్థమైతే, మార్చు తీసుకురావడం సులభమౌతుంది. ఒక భగత్‌సింగ్, ఒక మహాత్మా గాంధీ వంటి వారితో పాటు శాస్త్రజ్ఞులు, న్యాయమూర్తులు... వివిధ రంగాలకు చెందిన నిపుణులు తయారయ్యారంటే... వారిపై టీచర్ల ప్రభావం ఎంతోవుంది. కాబట్టి ఉపాధ్యాయులు ప్రజాస్వామ్యం, సమానత్వం, లౌకికతత్వం వంటి ఉన్నతమైన విలువలు తిరిగి నెలకొల్పేలా, ప్రస్తుతం ఈ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, విచ్చలవిడి కార్పొరేట్ దోపిడీ నుంచి రక్షించుకునేలా సమాజాన్ని సమాయత్తం చేసే శక్తి టీచర్లకు వుంది. జాతీయోద్యమ కాలంలో కదలివచ్చిన యువతరం బ్రిటిష్ వారిని ఎదుర్కోవడంలో ముందుపీఠిన నిలిచారు. మళ్లీ ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తోన్న శక్తులకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు విజ్ఞానజ్యోతులను వెలిగించాలి. నేనేం చేయలేను, మన చేతిలో ఏం లేదు... అనే ఒక నీరస ధోరణిలోకి వెళితే... భారతజాతి జవసత్వాలు ఉడిగిపోతున్నట్టి జాతిగా మిగిలిపోతుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలను ఎదిరించే చైతన్యం, పట్టుదలను పెంపొందించి... ఈ జాతిలో తిరిగి జవసత్వాలు నింపి, దిశా నిర్దేశాన్ని, కర్తవ్యాన్ని బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై వుంది. ఉపాధ్యాయులు పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడంతో పాటు... ఉత్తమ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించగలరు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు... మనకు వేలాది మంది ఉత్తమ నాయకులను అందించిన ఉపాధ్యాయులందరికీ కతజ్ఞతలు తెలియజేసుకుంటూనే, మళ్లీ అటువంటి మహోద్యమం వైపు జాతిని నడిపించడానికి ఉపాధ్యాయులంతా కంకణం కట్టుకోవాలి.










