Aug 16,2021 07:14

     ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ఇటీవల 'దీపిక' విమర్శ వ్యాస సంపుటిని వెలువరించారు. మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాల పట్ల అవగాహన, అధ్యయనం, తులనాత్మక విమర్శ దృష్టి ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. 'దీపిక'లో వివిధ సందర్భాల్లో రాసిన వైవిధ్యభరితమైన 36 వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాలను అంశాల ప్రాధాన్యాన్ని అనుసరించి వర్గీకరించడం ఔచిత్యంగా ఉంది. అభ్యుదయ పథంలో సజీవ స్రవంతి అభ్యుదయ కవిత్వం' వ్యాసంలో తొలి ప్రజాకవి వేమన, గురజాడ, శ్రీశ్రీ మొదలుకొని అభ్యుదయ కవులందరినీ ప్రస్తావించి వారి కవిత్వాన్ని విశ్లేషించడం సముచితంగా ఉంది.
      హిరోషిమా, నాగసాకిపై అమెరికా బాంబులు విసిరి దారుణ మారణకాండను సృష్టించిన సంఘటనను నిరసిస్తూ అనిసెట్టి 'అణు సంగీతం' పేరిట తొలిసారిగా కవిత రాశాడు. ఆయన బాటలో రెంటాల నిరసన గీతం రాశారు. పెనుగొండ వారు అనిసెట్టి విషయాన్ని ప్రస్తావిస్తే బావుండేది. ప్రపంచీకరణ నిరసనతో వచ్చిన అభ్యదయ కవుల కవితలను సమగ్రంగా రచయిత ఉటంకించాడు. 'అభ్యుదయ సాహిత్యం - దళిత జీవన చిత్రణ' వ్యాసంలో కథా సాహిత్యంలోనూ, నవలా సాహిత్యంలోనూ దళిత జీవన బతుకులను సవివరంగా పేర్కొన్నాడు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి దళిత సాహిత్యం ఆరంభ వికాసాలను సాకల్యంగా, సహేతుకంగా చేసిన విమర్శతోపాటు డా|| చందు సుబ్బారావు, ఆర్వీ రామారావు, డా|| సంజీవమ్మ మాచిరెడ్డి దంపతుల కృషిని పేర్కొన్నాడు. ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ఆచార్య ఎస్వీ సత్యనారాయణల కృషిని సవివరంగా పేర్కోవడం బావుంది. ఆచార్య రాచపాళెం వారిని గొప్ప మార్కి ్సస్టు విమర్శకుడిగా మెచ్చుకుంటూ, ఆయన వ్యాసంలో ఉన్న ఒకటి రెండు లోపాలను నిర్మొహమాటంగా చెప్పడం సహృదయ విమర్శ లక్షణం.
    'గురజాడ సాహిత్యం : వక్రీకరణలు - వాస్తవాలు' వ్యాసాన్ని సమగ్రంగా చర్చించి విశ్లేషించాడు. గురజాడ సాహిత్యంలో జరిగిన వక్రీకరణలను నిరసించాడు. డా|| సి.నారాయణరెడ్డి ఆయన సిద్ధాంత గ్రంథంలో గురజాడతో పాటు రాయప్రోలు వారిని యుగకర్తగా పేర్కొనడాన్ని ఖండించాడు. అరసం నేత డా|| ఎస్వీ సత్యనారాయణ ఇద్దరు యుగకర్తలు వాదాన్ని సహేతుకంగా ఖండించాడు. వ్యక్తి కేంద్రమైన ప్రణయ ధర్మానికి పట్టం కట్టిన రాయప్రోలును, సమాజ కేంద్రమైన ప్రజాస్వామ్య ధర్మాన్ని ప్రవచించిన గురజాడ సరసన నిలిపే ప్రయత్నం ఆయా సాహితీవేత్తల హ్రస్వ దృష్టికి నిదర్శనమని నిరసించాడు. 'మహాకవి జాషువా మనకెప్పటికీ అవసరమే' అనే వ్యాసంలో తాపీ ధర్మారావు గారి ప్రేరణతో జాషువా యుద్ధ ప్రచార శాఖలో చేరాడని, ఆయన ద్వారా అరసం ప్రణాళిక విశేషాలను తెలుసుకొని 1943లో కాందీశీకుడి కావ్యంలో జాషువా కమ్యూనిస్టు పార్టీని ప్రశంసిస్తూ 'కొడవటి టెక్కెమున్‌ దలను గూరిచి కార్మిక కర్షకాళితో.. విచిత్రముల్‌' అనే పద్యాన్ని రాశారని తెలిపారు. దీనికి జాషువాపై ప్రపంచ రాజకీయ పరిణామాలు, మరోవైపు ఆంధ్ర దేశంలో ఆవిర్భవించిన అరసం సిద్ధాంతాలు ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి అన్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారి అభిప్రాయాన్ని ఉటంకించి సమర్ధించడం బావుంది.
     'తెలంగాణ విమోచన పోరాట సాహిత్యం - ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘీభావం' వ్యాసంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అరసం రచయితలు సోమ సుందర్‌ 'వజ్రాయుధం', ఆరుద్ర 'త్వమేవాహం', అనిసెట్టి 'అగ్నివీణ', గంగినేని 'ఉదయిని', రెంటాల 'సర్పయాగం' వంటి కవితా సంకలనాల్లో నవాబు దారుణాలకు నిరసించారు. సుంకర- వాసిరెడ్డి 'మా భూమి', 'ముందడుగు' నాటకాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించాయి. బొల్లిముంత శివరామకృష్ణ 'మృత్యుంజయులు', మహీధర రామమోహనరావు 'ఓనమాలు', తిరునగరి 'సంగం' నవలలు తెలంగాణా పోరాటంలో ప్రజలను జాగృతం చేశాయి. వామపక్ష పాత్రికేయులు మద్దుకూరి చంద్రశేఖరరావు తెలంగాణ సాయుధ పోరాటంపై వచ్చిన సాహిత్యాన్ని సమగ్రంగా విశ్లేషించారని తెలిపాడు. 'ముద్దుకృష్ణ వైతాళికులు' కవితా సంకలనం (1932) దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏకపక్ష నిర్ణయంతో అందులో కవితలన్నీ భావకవుల ప్రేమగోలగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వివాదంలో విస్మరణకు గురైన 53 మంది కవుల కవితలతో అనిసెట్టి, రెంటాల, గంగినేని, అవసరాల సూర్యారావుల సంపాదకత్వంలో కల్పన కవితా సంపుటి వచ్చిందని పేర్కొన్నాడు.
      కథా సంకలనాలకు సంబంధించి 1932 నాటి కథావళి, ప్రామాణికత లోపించిన తొలితరం, మలితరం కథల సంకలన వ్యాసాల్లో కథల్లో లోపాలను సహేతుకంగా నిరూపించి, సరిచేసే ప్రయత్నం చేయడం విమర్శకుడిగా అభినందనీయం. కథా సాహిత్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాత్మక సూచనలు చేశాడు. మాజీ ప్రధాని, ప్రముఖ రచయిత పి.వి.నరసింహారావు రాసిన 'గొల్ల రామవ్వ' కథను విస్తృత కథల సంకనంలో చేర్చాడు. ఈ కథను చారిత్రక దృష్టితో విశ్లేషించాడు. 'నవ్యకవితా ఝరి నయాగరా' వ్యాసంలో నయాగరా కవులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి రాసిన తొమ్మిది కవితలతో పాటు వారి ప్రణాళికను ప్రచురించారు. ఆ గ్రంథాన్ని నవ్యకళా పరిషత్తు నరసరావు పేట కార్యదర్శి అనిసెట్టి పెండ్లి సందర్భంగా అంకితం చేశారు. ఈ సంపుటిపై వచ్చిన ప్రశంసలతో వ్యాసాన్ని ముగించడం బావుంది.
      'నిత్యాభ్యుదయ రచయిత విశాలాంధ్ర ముత్యాల' వ్యాసంలో ప్రముఖ అభ్యుదయ సాహితవేత్త, అరసం కార్యనిర్వాహక కార్యదర్శిగా ముత్యాల ప్రసాద్‌ ... విశాలాంధ్ర సాహితీ పేజీలో ఎందరో యువ రచయితలను ప్రోత్సహించాడు. సాహితీ పేజీని అభ్యుదయ సాహితీ వేదికగా మలిచాడు. సందర్భోచితాలైన సంపాదకీయాలతో పాఠకులను ఆకర్షించాడని ఆయన ప్రతిభా విశేషాలను సముచితంగా పేర్కొన్నాడు. ప్రముఖ అభ్యుదయ రచయిత 'శశిశ్రీ'ని తెలుగు సాహతీ దీపశిఖ' వ్యాసంలో ఆయన జీవిత, రచనా విశేషాలను సమన్వయించాడు. అభ్యుదయ సాహిత్యోద్భవ రథ సారధులైన సెట్టి ఈశ్వరరావు, రాంభట్ల కృష్ణమూర్తి, సోమసుందర్‌, రెంటాల, ఎస్వీ సత్యనారాయణ వంటి వారి జీవిత సాహితీ విశేషాలను ఈ సంపుటిలో సమగ్రంగా చర్చించి విశ్లేషించాడు. 'కథలు రాయడం ఎలా?', 'ప్రాంతీయ కథా సంకలనాల పరామర్శ', 'ప్రసిద్ధ కవితా సంకలనాల పరిచయం వ్యాసాలు', కొత్త రచయితలకు ఎంతో ప్రయోజనాత్మకాలు.
    ఈ సంపుటిలో మంచి మాటల పేరిట కథ, కవిత్వం, నాటకం, విమర్శ వ్యాస సంపుటాలకు విశ్లేషణాత్మక ముందుమాటలు ఎనిమిది సంపుటాలకు రాశాడు. 'హనుమారెడ్డి సాహిత్యం - విహంగ వీక్షణం' వ్యాసంలో 'వర్గకవి శ్రీశ్రీ' అనే గ్రంథాన్ని నిర్మొహమాటంగా ఖండించాడు. ఈ వ్యాసాలన్నింటి ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. సరళ సుందరమైన శైలిలో పాఠకుల మెదడుకు పదును పెట్టే చర్చలు సాగాయి. సాహితీ ప్రియులూ, అభ్యుదయ సాహిత్య పరిశోధకులూ, యువ రచయితలూ విధిగా చదువదగిన విమర్శ వ్యాస సంపుటి 'దీపిక'.
 

- డా|| పి.వి.సుబ్బారావు
98491 77594