Sep 21,2023 19:02

ఘనంగా 161వ జయంతి
ప్రజాశక్తి - భీమడోలు
   వాడుక భాష వ్యాప్తికి, సమాజ సంస్కరణలకు రచనలు చేసిన అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ వెంకట అప్పారావు ధన్యజీవి అని అన్నేవారి గూడెం ఎంపిపి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్‌కె.మస్తాన్‌ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులు గురజాడ వెంకట అప్పారావు 161వ జయంతిని కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గురజాడ అప్పారావు రచనలో ఒకటైన కన్యాశుల్కం నాటకం సమాజ సంస్కరణలకు బీజం పోసిన విధానాన్ని వివరించారు. ఇదేవిధంగా 'దేశమును ప్రేమించుమన్న గీతం' అప్పటి ప్రజలకు కలిగించిన దేశభక్తి గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు గురజాడ రచనలు, బోధనలపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, రాగయుక్తంగా పద్యాల ఆలాపణ, ఇతర అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎం.విజయ కుమారి, సిహెచ్‌ రమాజ్యోతి, ఎం.దుర్గా ప్రసాదిని, పిఎం.శారవాణి, కెటిఎస్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.