
అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష
తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో 3, 6, 9వ తరగతి విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాలపై సర్వే కోసం శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని కెఎన్‌ఎం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో 3, 6, 9 తరగతుల నుండి ఎంపిక చేసిన 30 మంది విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 1116 పాఠశాలల్లో 28938 మంది విద్యార్థులు ఈ సర్వే పరీక్షలో పాల్గొన్నారు. 2232 మంది ఉపాధ్యాయులు, 1116 మంది ప్రధానోపాధ్యాయులకు సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్యారా పాఠశాలల్లో అభ్యసన సామర్థ్యాలను పరిశీలిస్తారని డిఇఒ సుధాకర్ రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం సర్వ శిక్ష అభియాన్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.