ప్రజాశక్తి - కురుపాం : తెలుగుదేశం పార్టీ కురుపాం నియోజకవర్గ అభ్యర్థి ఎవరైనా అంతా కలిసికట్టుగా సమన్వయంతో పని చేస్తామని కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ అన్నారు. ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరులు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఎవరని, కార్యకర్తలకు అర్థం కావడం లేదని, అలాగే గ్రూపులు ఉన్నాయని, దీనిపై కార్యకర్తలకు స్పష్టత ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కురుపాం నియోజకవర్గంలో టిడిపి గ్రూపులు ఉండడం వాస్తవమేనని, కానీ అభ్యర్థి విషయంలో చంద్రబాబునాయుడు ప్రకటిస్తారని తెలిపారు. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే గెలుపునకు నియోజకవర్గంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. అనంతరం శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడుతూ చంద్రబాబు యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన సమయంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా నని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కలిశెట్టి కొండయ్య, డొంకాడ రామకష్ణ, ఎం. పురుషోత్తమనాయుడు, గురాన శ్రీరామ్మూర్తి, సుకేష్ చంద్ర పండా , తదితరులు పాల్గొన్నారు.










