ప్రజాశక్తి - కుక్కునూరు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోయి నిరాశ్రయులవుతున్న 41.15 కాంటూరులోని మొదటివిడత ముంపులో ఉన్న నిర్వాసితుల ఇంటి విలువల పరిహారపు జాబితాలో అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలని, సమస్యలు పరిష్కరిస్తామని స్పెషల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్.రంగలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన 'ఎ' బ్లాక్ ఇంటి పరిహారపు విలువల జాబితాను ప్రకటించి అభ్యంతరాలపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగలక్ష్మి మాట్లాడుతూ రెండు నెలల క్రితం ప్రత్యేక బృందంతో పోలవరం ప్రాజెక్టు వల్ల మొదటి విడత ముంపులో ఉన్న కుక్కునూరు 'ఎ' బ్లాక్‌లో ఇంటింటికీ తిరిగి ఇంట్లో ఉన్న చెట్లు, మొక్కలు, మరుగుదొడ్లు, స్థలంతోపాటు ఇంటి విలువల సర్వే నిర్వహించామన్నారు. అనంతరం గ్రామసభలో తుది జాబితాను ప్రకటించి అభ్యంతరాలపై నిర్వాసితులు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హత కల్గిన ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేస్తామన్నారు. ఈ గ్రామ సభలో ఎస్‌డిసి ఏలూరు కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ టి.వీరాస్వామి, కుక్కునూరు పంచాయతీ సర్పంచిరావు, మీనా, విఆర్‌ఒ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాసితులు వై.నాగేందర్రావు, రావు వినోద్, వెంకన్నబాబు, నాగులమీరా, ఎం.సత్యనారాయణ, వి.భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.










