ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బంగారు గొలుసు చోరీ కేసుల్లో ఐదుగుర్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.68 లక్షల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఈ మేరకు వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వెల్లడించారు. మంగళగిరి పట్టణం, రూరల్, తాడేపల్లి, పెదకాకాని, లాలాపేట, పాత గుంటూరు పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన చోరీల్లో మంగళగిరికి చెందిన మచ్చ వెంకటేష్, పటాన్ సలీంబాష, తోట సాయి, చేకూరి మల్లేశ్వరరావు, కంతేరుకు చెందిన పలగాని మోహనకృష్ణను మంగళగిరిలోని డాన్‌బాస్కో స్కూల్ జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు. మొత్తం 39 కేసుల్లో 1243 గ్రాముల బంగారాన్ని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతేడాది మే 28న ఇద్దరు వ్యక్తులు మంగళగిరి నుండి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా డిలైట్ ధాబా దాటిన తరువాత వెనుక కూర్చున్న మహిళ మెడలో రెండు పేటల బంగారపు గొలుసును నిందితులు లాగారని, ఈ క్రమంలో మహిళ బండి నుండి కిందపడి తీవ్రగాయాలు పాలయ్యారని, అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగా మృతి చెందారని ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి శ్రీనివాసరావు, మంగళగిరి డిఎస్‌పి జె.రాంబాబు పాల్గొన్నారు.










