ప్రజాశక్తి- మెరక ముడిదాం : ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని గ్రామాలలో అభివృద్ధిపై దృష్టి సారించాలని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపిపి తాడ్డి కృష్ణవేణి అధ్యక్షతలన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్ ముందుగా హౌసింగ్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి పొంది ఇల్లులు కట్టుకొనే వారికి బిల్లులు ఒక్క పైసా కూడా పెండింగ్ ఉండ కూడదన్నారు. గ్రామాలలో ఎన్‌ఆర్‌జి అసిస్టెంట్లు కరెంటు సమస్య లేకుండా చూడటానికి సచివాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. సోమలింగా పురంలో లోవోల్టేజ్ సమస్య ఉందని, గరుగుబిల్లి, యాడికలో డామేజ్ కరెంటు పోల్స్ ఉన్నాయని ఆయా ప్రజా ప్రతినిధులు తెలుపగా వాటిని పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు. మండలంలో అనధికార వ్యవసాయ మోటార్లు ఉన్నాయని వాటి వల్ల లోవోల్టే సమస్య వస్తుందని విద్యుత్ అధికారులు జెడ్‌పి చైర్మన్‌కు చెప్పారు. అటువంటి వాటిని వెంటనే తొలిగించాలని అవసరమైతే వారిపై పోలీస్ కేసులు పెట్టాలని తెలిపారు. ఇటువంటి వాటి వల్ల నిజమైన వ్యవసాయ రైతులుకు నీరు అందుబాటులో ఉండదని చెప్పారు. ఉపాధి హామీ ద్వారా బిటి రోడ్లు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం వేగవంతం చేయాలని, రైతులకు ఈ క్రాప్ నమోదు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలు వద్దకే వైద్యం చక్క నైనదని, ఫ్యామిలీ ఫిజిషన్ వైద్యం గురించి ప్రజలకు తెలియ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ రత్నం, తహశీల్ధార్ విజయ భాస్కర్, వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, ఎస్‌వి రమణరాజు, కెఎస్‌ఆర్కే ప్రసాద్, కోట్ల వెంకటరావు, టి. హరిబాబు, పప్పల కృష్ణమూర్తి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.










