
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమయంలోనే రాజకీయాలపై దృష్టి సారించాలని మిగిలిన సమయంలో అభివద్ధి కోసం కషి చేయాలని విశ్రాంత ఐఎఎస్ అధికారి అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్‌లో బుధవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా రమేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనుకుందని, మనకంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకోలేక పోవడం వల్ల గుంటూరు జిల్లా ఎంతో వెనుకబడిందన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పౌర సమాజ సంస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం, ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం, సామాజిక, ఆర్థిక అంశాలపై కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం విశ్రాంత ఎఎస్‌పి కాళహస్తి సత్యనారాయణ, మానవత సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ప్రముఖ వ్వక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు, అవగాహన సెక్రటరీ కొండా శివరామిరెడ్డి, తెలుగు భాషోద్యమ నేత డాక్టర్ వి.సింగారావు, దీక్షిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు యడ్లవల్లి కష్ణ మాట్లాడారు.