Jul 08,2023 19:36

మంత్రాలయంలో పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - మంత్రాలయం
నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రతి సవాల్‌ విసిరారు. శనివారం రైతు దినోత్సవం (వైఎస్‌ఆర్‌ జయంతి) సందర్భంగా స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో ఉన్న వైఎస్‌.రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను అభివృద్ధి చేయలేదని, ఈసారి జరిగే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని తిక్కారెడ్డి కోరడం సంతోషమేనని తెలిపారు. 2014-19 వరకు ఎమ్మెల్యేగా మీరేం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీరు-చెట్టు తిక్కారెడ్డి, ఆయన సోదరుడు కమీషన్లు తిన్న విషయం తెలిసిందేనన్నారు. నాడు వైఎస్‌ఆర్‌ హయాంలో, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పులికనుమ ప్రాజెక్టు వచ్చిందని, దానిని తిక్కారెడ్డి తానే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. సుమారు 700 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.70 కోట్లతో 5 లిఫ్ట్‌ ఇరిగేషన్లు తెచ్చామని తెలిపారు. కౌతాళం మండలం ఎరిగేర గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.50 లక్షలతో ఎస్‌ఎస్‌ ట్యాంకును నిర్మించామని, వారంలో ప్రారంభిస్తామని చెప్పారు. కేవలం కోసిగిలోనే 1250, మంత్రాలయంలో 650 ఇంటి స్థలాలు మంజూరు చేశామని తెలిపారు. రాని వారికి మళ్లీ భూమి కొనుగోలు చేసి అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో చర్చించామని తెలిపారు. త్వరలో భూమి కొనుగోలు పూర్తి అవుతుందన్నారు. తాను కాదని, తన అన్న కుమారుడు ప్రదీప్‌ రెడ్డి కాదని, మండల నాయకులు సమాధానం చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని సవాల్‌ విసిరారు. అనంతరం సర్పంచి తెల్లబండ్ల భీమయ్య మాట్లాడారు. ఇటీవల ఓ వైసిపి నాయకుడు టిడిపి తీర్థం పుచ్చుకున్నారని, త్వరలో తాను కూడా టిడిపిలో చేరుతున్నానని పుకార్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఊహాగానాలు ఎవరూ నమ్మవద్దని, పార్టీలతో సంబంధం లేదని, రాంపురం రెడ్డి సోదరులే ముఖ్యమని చెప్పారు. వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి, వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, మాజీ ఉప సర్పంచి గోర్కల్‌ కృష్ణస్వామి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో మండల కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి భారీ కేక్‌ కట్‌ చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా వెళ్తూ సోమప్ప సర్కిల్‌లో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కోసిగి (రూరల్‌)లో వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి నాయకులు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌ అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. ఎంపిపి ఈరన్న, మండల కన్వీనర్‌ బెట్టనగౌడ్‌, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మఠం మహంతేష్‌ స్వామి, వైసిపి నాయకులు నాడిగేని నాగరాజు, నాడిగేని నరసింహులు, ఎస్‌.మాణిక్య రాజు, ఐరన్‌గల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మంగమ్మ, జగదీష్‌ స్వామి, పి.నాగేష్‌ పాల్గొన్నారు. కౌతాళంలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి మండల నాయకులు దేశాయి ప్రహ్లాద ఆచారి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచి పాల్‌దినకర్‌, వైస్‌ ఎంపిపి బుజ్జి స్వామి, మాజీ సర్పంచి అవతారం, చౌదరి బసవ, వడ్డే రామన్న, సక్కరి తిక్కయ్య, ఉమాపతి, సమ్మద్‌, భీమేష్‌, రాజా అహ్మద్‌, వీరేష్‌, బంటకుంట ఈరన్న, వార్డు మెంబర్‌ రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే మండలంలోని బదినేహల్‌ గ్రామంలో వైసిపి నాయకులు వీరభద్ర గౌడ్‌, ప్రభాకర్‌ రెడ్డి, ఉప సర్పంచి ప్రసన్నకుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. మండలంలోని కుంబాలనూర్‌ గ్రామంలో వైసిపి నాయకులు అనిల్‌ కుమార్‌, సూరిబాబు, వీరన్న గౌడ్‌, గోతులదొడ్డి హనుమేష్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నందవరంలో సర్పంచి సావిత్రి, ఉప సర్పంచి జె.శివారెడ్డి గౌడ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ముగతి విరుపాక్షి రెడ్డి, పూలచింత సురేష్‌ గౌడ్‌, రమేష్‌ గౌడ్‌, మీసాల సంపత్‌, చాంద్‌ తాత పాల్గొన్నారు.

ఎమ్మిగనూరులో పండు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి