
కడప అర్బన్ : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ అన్నారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు గాలికి వదిలేసి బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులను సైతం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేకపోగా వలసలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందన్నారు. సరైన పరిపాలన అందించకుండా తన అజెండాతో ప్రజలను అణచివేయాలను కోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని శాశిస్తూ రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఎటువంటి నిధులివ్వడం లేదని తెలిపారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అజెండా తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం 30 ఏళ్లు మేమే పరిపాలించాల అనే అణచివేత ధోరణితో ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక అటకెక్కాయని చెప్పారు. అప్పర్‌భద్ర ప్రాజెక్టు వల్ల తుంగభద్రకు భవిష్యత్తులో నీళ్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. తద్వారా కెసి కెనాల్ ఆయకట్టు రైతాంగం భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలో నిర్మించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన ముఖ్యమంత్రి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి మూడు దపాలుగా శిలాఫలాకాలకే పరిమితమయ్యారన్నారు. కేంద్ర నిఘా సంస్థలు హోం మంత్రికి పక్కా సమాచారం ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు బిజెపి కారణమన్నారు. టిడిపి కూడా బిజెపి పట్ల సానుకూల వైఖరి మంచి పద్ధతి సరికాదన్నారు. చంద్రబాబును అరెస్టు చేసే విధానాన్ని ఆయన ఖండించారు. న్యాయస్థానాలు ఆలస్యం చేయకుండా తీర్పులు ఇవ్వాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలపై పోటీపడి భారాలు వేస్తున్నాయని ఈ బారాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ నెల 21వ తేదీ నుంచి బస్సు జాతాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాయలసీమ బస్సు జాత ఆదోనిలో ఈ నెల 21న ప్రారంభమై కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, మీదుగా విజయవాడకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో బస్సు జాతాల ముగింపు సందర్భంగా నవంబర్ 10వ తేదీన విజయవాడలో ప్రజారక్షణ భేరి పేరుతో భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామమోహన్, మనోహర్, శివకుమార్, ఐఎన్.సుబ్బమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సత్యం, దస్తగిరిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, అన్వేష్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు శివకుమార్, సునీల్, రాజేంద్ర, చిన్ని, ఓబులేసు, షాకీర్, నాయకులు వెంకటసుబ్బయ్య, చంద్రారెడ్డి, భైరవ ప్రసాద్, చాంద్ బాషా, మండల శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.