ప్రజాశక్తి-గొలుగొండ:అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సమాధులు, పార్కు అభివృద్ధికి నోచకోలేదు. వీటి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం శోచనీయం. అల్లూరి జయంతి వర్ధంతి సందర్భంగా భారీ సభలు ఏర్పాటు చేసి అమలుకు నోచుకోని హామీలను ప్రకటించడం తప్ప అవి ఆచరణలోకి రాక ఏ విధమైన అభివృద్ధి కూడా ఇక్కడ కానరాలేదు. ఈనెల 7న అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
అల్లూరి సీతారామరాజు సమాధులు ఉన్న పార్క్ అభివృద్ధి విషయంలో నీలి నీడలు అలుముకున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో శిథిల కట్టడంలో దర్శనమిస్తోంది. పార్క్‌ను సందర్శించేందుకు పలువురు పర్యాటకులు కార్తిక మాసం, వేసవి సెలవుల్లో ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా తీర్చిదిద్దుతామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం, నేడు వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మూడు సంవత్సరాల క్రితం మంత్రి హోదాలో వచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా నేటికీ నిధులు విడుదల కాలేదు. పార్కులో సీతారామరాజు, గంటందొర సమాదుల షెడ్లు పైకప్పులు పెచ్చులూడుతున్నాయి. సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు చొప్పగడ్డితో నిర్మించిన షెడ్లు శిథిలమవతున్నా పట్టించుకునే నాధుడే లేడు.










