ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో కాకినాడ రూరల్ సర్పవరంలో ఉన్న ఏకైక ఆటోనగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన దీన్ని ఇటు పాలకులు, అటు అధికారులు పట్టించుకోకపోవడంతో అసౌకర్యాల చెరలో కొట్టుమిట్టాడుతోంది. అధ్వానంగా మారిన రహదారుల వల్ల పారిశ్రామిక వాడ చిందరవందరంగా మారింది. వర్షం వస్తే నీరు బయటకు పోయే మార్గాలు లేక అస్తవ్యస్తంగా తయారవుతోంది. దీంతో పలువురు కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. సుమారు 52 ఎకరాల విస్తీ ర్ణంలో సర్పవరం ఆటో నగర్ విస్త రించి ఉండగా 284 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ పలు మెకానిక్ షెడ్లు, వెల్డింగ్ షాపులు, లారీలు, వ్యాన్ల మెకానిక్, బాడీ బిల్డింగ్, కట్టర్, పెయింట్లు, టైర్ల మార్పులు, ఎలక్ట్రికల్ తదితర పనులు చేసే చిన్న చిన్న పలు పరిశ్రమలు ఉన్నాయి. కాకినాడ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో సర్పవరం శివారులో 2000 సంవత్సరం మార్చి 27న ఆటో నగర్ ఏర్పాటయింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 వేలమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఓనర్ కం వర్కర్లు గానే ఎక్కువ మంది జీవనం పొందు తు న్నారు.
సమస్యల వలయంలో...
ఎపిఐఐసి ఆటో నగర్ అభివద్ధికి నిధుల కొరత వల్ల సమస్యల వలయంలో చిక్కుకుంది. దాదాపు అన్ని రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. గుంతలు ఏర్పడి అవస్థలు తప్పడం లేదని కార్మికులు వాపోతున్నారు. రహదారుల పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందని, సరైన రహదారి లేకపోవడం తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో రోజుల తరబడి మురుగు నీరు నిల్వ ఉండిపోతుందని, రోగాలు కూడా వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని పాలకులకు వివరించినా పట్టించుకోవడం లేదంటూ ది కాకినాడ ఆటో గేరేజ్ ఓనర్స్ అసోషియేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఇక్కడ ఒకేఒక్క ఐటి పార్కు ఉంది. వర్షం వస్తే ముంపు సమస్యలు వల్ల ఐటి ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. రాకపోకలు సాగించేందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోసం రూ.2 కోట్లు నిధులు కేటాయిస్తామని గతేడాది నవంబర్ 25న జిల్లాకు వచ్చిన సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ఇక్కడ పర్యటించి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నిధులు గనుక ఇస్తే కేంద్రం నుంచి మరో రూ.3 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడి అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నిధులను కేటాయించి ఆటోనగర్ అభివద్ధికి సహకరించాలని కోరుతున్నారు. సమస్యలతో సహవాసం చేయలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక నేతలు కూడా త్వరితగతిన స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు యజమానులు, కార్మికులు, అసోసియేషన్ సభ్యులు ముక్తకంఠంతో కోరుతున్నారు.










