Oct 19,2023 21:42

రూ.2 కోట్లతో పలు పనులు
గ్రామాభివృద్ధే ధ్వేయం : సర్పంచి నాగరాజు
ప్రజాశక్తి - యలమంచిలి

              అభివృద్ధి పథంలో పయనిస్తున్న మండలంలోని కట్టుపాలెం పంచాయితీ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామం అనేక ఏళ్లుగా అభివృద్ధిలో అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే పొన్నమండ నాగరాజును గ్రామస్తులంతా కలిసి సర్పంచిగా ఎన్నుకున్నారు. నాగరాజు కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లప్పుడూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామంలో ఏఏ పనులకు నిధులు రాబట్టాలో ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. గతంలో వైసిపి పాలకొల్లు ఇన్‌ఛార్జిగా, జెడ్‌పి ఛైర్మన్‌గా ఉన్న కవురుశ్రీనివాస్‌తో, ప్రస్తుత ఇన్‌ఛార్జిగా ఉన్న గుడాల శ్రీహరి గోపీ తో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడంతో గ్రామంలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చేలా జల జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.40 లక్షల నిధులతో నూతన పైపులైను వేయడమే కాకుండా చాలావరకు ఇంటింటికి కులాయి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. నడవడానికి కూడా అసౌకర్యంగా ఉన్న స్థానిక అగ్నికుల క్షత్రియుల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిని జెడ్‌పి నిధులు రూ.20 లక్షలతో విశాలవంతమైన సీసీ రహదారిగా నిర్మించారు. అదే కాలనీకి జెడ్‌పి నిధులు రూ.ఐదు లక్షలు, మండల పరిషత్‌ నిధులు రూ.4 లక్షలతో డ్రెయినేజీ నిర్మించారు. ఎప్పటినుంచో అభివృద్ధికి నోచని స్థానిక ఎస్‌సి కమ్యూనిటీ హాలు ఆధునీకరణకు జెడ్‌పి నిధులు రూ.పది లక్షలతో పనులు చేస్తున్నారు. మండల పరిషత్‌ నిధులు రూ.2.5 లక్షలతో బుడగజంగాల కమ్యూనిటీ హాలు ఆధునికీకరణకు కృషి చేశారు. స్థానిక వినాయకుడి ఆలయం వద్ద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ నిధుల రూ.3.5 లక్షలతో నూతనంగా కల్వర్టును నిర్మించారు. మరొ రూ.4 లక్షల నిధులతో పంచాయతీ వెనుక ఉన్న పల్లపు ప్రాంతాన్ని మెరక చేయించి అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు నూతన సచివాలయ భవనానికి వెళ్లే రహదారిని రూ.2 లక్షలతో గ్రావెల్‌ రోడ్డు నిర్మించారు. స్థానిక ఎన్‌టిఆర్‌ కాలనీ ఎదురుగా ప్రజల కోరిక మేరకు రూ.2.5 లక్షలతో కల్వర్టును కూడా పూర్తి చేశారు. అన్నిటికంటే ప్రధానంగా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండేవిధంగా గ్రామ నడి బొడ్డున రూ.40 లక్షల నిధులతో నూతన సచివాలయ భవనం, మరొక రూ.40 లక్షలతో హెల్త్‌ క్లినిక్‌ భవనం, ఆర్‌బికె కేంద్రాలను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. ఉపాధి హామీ చట్టం ద్వారా రూ.లక్షల నిధులతో స్థానికంగా ఉన్న మంచినీటి చెరువులో పూడికతీత పనులు చేయించి అందుబాటులోకి తేవడంతో పలువురు గ్రామస్తులు సర్పంచి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.