Mar 18,2023 01:04
మాట్లాడుతున్న సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్‌

ప్రజాశక్తి-రేపల్లె: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అభివృద్ధి నిల్‌, అప్పులు ఫుల్‌ అన్నట్లుగా ఉందని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 24 వేల మందికి ఉపాధి కల్పించామని ప్రభుత్వం బడ్జెట్లో చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. యువతకి ఉపాధి చూపటం లేదన్నారు. కనీసం డీఎస్సీ పరీక్షలు పెడతామని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా చేయలేదు. జాబ్‌ క్యాలెండర్‌ ఊసేలేదు, ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వ వాటా 10శాతం సుమారు 500 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ అదే ఉపాధి పథకంలో హౌసింగ్‌ స్కీం కింద రూ.30 వేలు సామగ్రి పేరుతో బదలాయించడం అంటే ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడవటమేనని అన్నారు. సంవత్సరానికి 28 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోతోందని అన్నారు. రూ.2.79 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి రూ.30 వేల కోట్లు మాత్రమే మూలధనం పెట్టుబడిగా కేటాయించారు. గత సంవత్సరం మూలధనం పెట్టుబడి రూ.32 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేసింది రూ.16 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం, విశాఖ స్టీల్‌ను కాపాడుకోవటానికి, విద్య, వైద్యానికి స్పష్టంగా కేటాయింపులు లేవని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కె ఆశీర్వాదం, జి దానియేలు పాల్గొన్నారు.