Apr 21,2022 06:41

కొత్త సిమెంటు ఫ్యాక్టరీల కోసం ప్రజల నుండి సాగు భూములను సేకరించారు. భూసేకరణ జరిగి దశాబ్దాలు గడిచినా పరిశ్రమలు నిర్మించలేదు. భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించిన పది సంవత్సరాలలో పరిశ్రమ నెలకొల్పి ఉపాధి కోల్పోయిన రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వాలు ప్రజల న్యాయమైన హక్కులను కల్పించటంలో విఫలమయ్యాయి. పొలాలు కోల్పోయిన రైతులు ఒక పక్క కూలీలుగా, రోజువారీ కార్మికులుగా మారారు. వారి జీవన ప్రమాణాలు పడిపోయాయి.


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలవటంతో పల్నాడు జిల్లా ఏర్పాటు మరియు జిల్లా కేంద్రం విషయమై కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. తమ ప్రాంతంలోనే జిల్లా కేంద్రం ఉండాలని ప్రజలు కోరుకోవటం సహజమే. అలాగైనా వెనకబాటుతనం నుంచి కొంతైనా బైట పడతామని ఆశ.
    రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలలో పల్నాడు ఒకటిగా ఉన్నదనేది కాదనలేని వాస్తవం. ఇక్కడ నదీ పరీవాహక ప్రాంతం, అత్యంత విలువైన భూగర్భ ఖనిజ సంపదలు ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో వుంది. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న 27 మండలాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ లెక్కలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇక్కడ అక్షరాస్యత సగటు 50.23 శాతంగా వుంది. రాష్ట్ర సగటు 67.41 శాతం, దేశ సగటు 74.04 శాతంతో పోల్చినపుడు ఇది చాలా తక్కువ. అలాగే స్వచ్ఛమైన మంచినీరు అందేవారు 29.9 శాతం, మరుగుదొడ్డి ఉన్న వారు 39.8 శాతం, వంట గ్యాసు కనెక్షను లేని వారు 63.5 శాతం, బ్యాంకు ఖాతా లేని వారు 53.5 శాతం, సొంత ఇల్లు లేని వారు 25 శాతం, మురుగునీటి పారుదల వ్యవస్థ లేని ప్రాంతాలు 34.13 శాతం, ఆఖరికి టి.వి లేని వారు కూడా 42 శాతం మంది ఉన్నారు. పల్నాటి ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి ఎంతగా గురైందో ఈ గణాంకాలను బట్టి అర్ధంచేసుకోవచ్చు.
     కూతవేటు దూరంలో కృష్ణా నది... రైతులు, రైతు సంఘాలు పోరాడి సాధించుకున్న నాగార్జున సాగర్‌ ఆనకట్ట ఉన్నప్పటికీ...పల్నాటి ప్రాంతంలో ఏటికేడు మెట్ట పొలాలుగా మార్చబడుతున్న మాగాణులు, తాగునీటి ఇబ్బందులనెదుర్కొనే గ్రామాల సంఖ్య పెరుగుతున్నది. నాగార్జున సాగర్‌ కుడి కాల్వ కిందకు వచ్చే ఆయకట్టు ఏడాదికేడాది నిర్లక్ష్యం గావించబడుతున్నది. డ్యాములో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం సకాలంలో నీరు వదలడం లేదు. వరికపూడిశల (దమ్మర్లగొంది) ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే బొల్లాపల్లి, వెల్దుర్తి, పుల్లల చెరువు, మాచర్ల ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. సుమారు రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీటితో పాటు ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ డ్యామ్‌ మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరు అందడంలేదు. ప్రాజెక్టును నిర్మిస్తామని గతంలో వైఎస్‌. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు శంకుస్ధాపనలు చేశారుగాని అంతకుమించి ముందుకు కదిలింది లేదు. ప్రస్తుత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని చెప్పుకోవటం తప్ప ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు. లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని అయోమయ స్థితి. దుర్గి మండలం లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు జరగటంలేదు. మౌలిక సదుపాయాల కల్పనకు సైతం ప్రభుత్వాలు పూనుకోలేదు.
     సున్నపు రాయి, గ్రానైటు ఖనిజాలు పుష్కలంగా వున్న ఈ ప్రాంతంలో నీటి వసతి కూడా ఉన్నది కనుక సిమెంటు ఫ్యాక్టరీలు నిర్మించబడ్డాయి. అనేక కొత్త సిమెంటు ఫ్యాక్టరీల కోసం ప్రజల నుండి సాగు భూములను సేకరించారు. భూసేకరణ జరిగి దశాబ్దాలు గడిచినా పరిశ్రమలు నిర్మించలేదు. భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించిన పది సంవత్సరాలలో పరిశ్రమ నెలకొల్పి ఉపాధి కోల్పోయిన రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వాలు ప్రజల న్యాయమైన హక్కులను కల్పించటంలో విఫలమయ్యాయి. పొలాలు కోల్పోయిన రైతులు ఒక పక్క కూలీలుగా, రోజువారీ కార్మికులుగా మారారు. వారి జీవన ప్రమాణాలు పడిపోయాయి. పల్నాడు ప్రాంతంలో భూసేకరణ జరిగి, నెలకొల్పని పరిశ్రమలు ఐదుకు పైగా ఉన్నాయి. పూర్తయిన పరిశ్రమలలో కూడా స్థానికులకు సరైన ఉద్యోగావకాశాలు కల్పించటంలో పరిశ్రమలు చిన్నచూపు చూస్తున్నాయి. అలాగే యాజమాన్యాలు చట్టాలను అమలు చేసేలా చూడటంలో ప్రభుత్వాల వైఫల్యం కనపడుతున్నది.
     విద్య విషయంలో పల్నాడు ప్రాంతం ఎంత వెనుకబడి ఉన్నదో అక్షరాస్యత రేటు (50.23 శాతం) చూసినట్లైతే అర్థం అవుతున్నది. అనేక గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఉన్న వాటిలో మౌలిక సదుపాయాలు లేవు. గత సంవత్సరం ప్రజా సంఘాల వారు నిర్వహించిన సర్వేలో 90 శాతానికి పైగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు. 85 శాతం పైగా పాఠశాలల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు ఉన్నాయి. కళాశాల విద్య సంగతి ఇంకా దారుణంగా ఉన్నది. ఉన్నత విద్య కోసం చాలా వరకు జిల్లా కేంద్రమైన గుంటూరు వెళ్ళాలి. నరసరావుపేట, మాచెర్ల లో తప్పితే (అవి కూడా ఎయిడెడ్‌) ఎక్కడా ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాష్ట్ర విభజనలో భాగంగా వచ్చినటువంటి కేంద్రీయ విద్యా సంస్థలలో ఒక్కటి కూడా పల్నాటి ప్రాంతానికి కేటాయించకపోవటంలో పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.
     పల్నాడులో బ్యాల వివాహాలు అగ్రస్థానంలో ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పాఠశాలల్లోనూ తొమ్మిది, పదవ తరగతులలో బాలికల డ్రాపౌట్లు ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గుంటూరు సర్వజనాసుపత్రికి ప్రసవం కోసం వచ్చే వారిలో పల్నాడు నుంచి పేద కుటుంబాలకు చెందినవారే ఎక్కువ. కాన్పు కోసం వచ్చిన 150 మంది మహిళల్లో 20 శాతం మంది 18 సంవత్సరాల లోపు వారేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పల్నాడు ప్రాంతంలో ప్రభుత్వ పెద్దాసుపత్రి ఒక్కటి కూడా లేకపోవటం వలన సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సహాయం అందడం లేదు. సమయానికి వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. ఒక మాదిరి రోగాలకు కూడా ఉచిత వైద్యం కోసం గుంటూరు వెళ్ళాలంటే పేద ప్రజలకు ప్రయాణ ఖర్చులు తలకు మించిన భారంగా తయారయ్యాయి. సరైన ప్రభుత్వ వైద్యం లేని కారణంగా ప్రైవేటు వైద్యం కోసం చూస్తున్న ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కొత్త ప్రభుత్వం మెడికల్‌ కాలేజి మంజూరు చేసినట్లు చెప్తున్నప్పటికీ నేటికీ కాలేజీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. పేదరికం కారణంగా సరైన పోషణ అందని బాలలు, యువత, రక్తహీనతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు అడుగడుగునా పల్నాటి ప్రాంతంలో దర్శనమిస్తారు.
      పాలకులకు నిజంగా చిత్తశుద్ధి వున్నట్టయితే దశాబ్దాలుగా పూర్తికాని ప్రభుత్వ ప్రాజెక్టులను, పరిశ్రమలను పూర్తి చేయాలి. విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే పూనుకోవాలి. వీటిని సాధించుకునేందుకు పల్నాటి ప్రజలు ముఖ్యంగా యువత నడుం బిగించాలి.
 

/ వ్యాసకర్త : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య,
పల్నాడు జిల్లా కన్వీనర్‌ /

ఆంజనేయ రాజు