ప్రజాశక్తి - వీరఘట్టం : దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడినా నేటికీ అనేక గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరానున్నాయంటే పాలకుల పనితీరు ఏ విధంగా ఉందో వీటిని చూస్తేనే అర్ధం చేసుకోవచ్చును. మండలంలోని కాగితాడ, ఎలీషాపురం, సంధిమానుగూడ, గదబవలస, బట్టిగూడ, రామాపురం, బల్లగుడ్డి, నీలంపేట, తదితర గిరిజన తండాల రహదారులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో గిరి పుత్రులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుకుంటున్నారు. మండలంలోని హుస్సేనాపురం 7వ బ్రాంచ్ నుండి ఈ గ్రామం మీదుగా నీలం పేట, ఎలిషా పురం, సంధిమాను గూడ వరకు 2019లో అప్పటి టిడిపి ప్రభుత్వ హయంలో రూ 4.65 కోట్లతో బిటి రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ఈ రహదారికి 40ఎంఎం చిప్స్ వేసి రోలింగ్ చేయడంతో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రాళ్ల పిక్కలు పైకి తేలిపోవడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరి పుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉండడంవల్ల 104, 108 వాహనాలు వచ్చేందుకు వీల్లేక గర్భిణీలు, అత్యవసర రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
మూతపడ్డ పాఠశాలలు
మండలంలోని వంకాయలగెడ్డ, గదబవలస, గాదిలంక, సింధునగర్‌లో పాఠశాలలు మూతపడడంతో గిరిజన విద్యార్థులు కిలోమీటర్లు పైబడి ఉన్న గ్రామాలకు వెళ్లి విద్యను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం నీలంపేట గ్రామ విద్యార్థులు హుస్సేన్ పురంలో ఉన్న పాఠశాలకు, కాగితాడ విద్యార్థులు కంబర గ్రామపాఠశాలకు, గదబవలస గిరిజనులు కత్తులకవిటి పాఠశాలకు, వంకాయలగెడ్డ విద్యార్థులు ఎం.రాజపురం పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. వర్షాలు పడినట్లయితే రహదారులు చిందర వందరంగా తయారవడంతో ఆరోజు విద్యార్థులు పాఠశాలకు స్వస్తి పలకవలసిందే. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు హామీలు తప్ప విద్యను అభివృద్ధి చేసే దాఖలా ఎక్కడా కానరావడంలేదని గిరిజనులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










