ప్రజాశక్తి- తెర్లాం : మండలంలోని చీకటిపేట గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఏళ్ల తరబడి నివసిస్తున్న ఈ దళితవాడలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారిని తమ తలరాతులు మారడం లేదని వాపోతున్నారు. సర్పంచులు మారినప్పటికీ గ్రామాభివృద్ధి మాత్రం జరగడంలేదని చెబుతున్నారు. కాలువల్లో పూడిక తీతలైన కనీసం తీయడం లేదని, ఫలితంగా కాలువలన్నీ పూడికలతో కప్పుడపోయాయని చెబుతున్నారు. పైగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు వేపుగా పెరిగిపోవడం వల్ల పాములు, తేళ్లు విష పురుగులు తిరుగుతున్నాయని దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని వాపోతున్నారు. కాలువలు బాగు చేయండి మహాప్రభో అని సర్పంచ్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని, సెక్రెటరీ కూడా కన్నెత్తి చూడటం లేదని మండిపడుతున్నారు. కనీసం వీధిలైట్లు కూడా సమకూర్చలేని పరిస్థితిలో నాయకత్వం ఉందని వాపోతున్నారు. స్వతంత్య్రం వచ్చి ఈన్నేళ్లయినప్పటికీ దళితవాడలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కేవలం నాయకుల నిర్లక్ష్యమే కారణంగా చెబుతున్నారు.
దళితవాడలో జరగని స్వచ్ఛభారత్
స్వచ్ఛభారత్‌లో భాగంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర పిచ్చి మొక్కలు తొలగింపునకు సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో చేయకుండా దళితులను దుర్భాషలాడుతూ అక్కడి నుంచి బీసీ కాలనీకి వెళ్లిపోయారని ఆ గ్రామ దళిత మహిళలు వాపోయారు. ఓట్లు వచ్చినప్పుడు తాము కావాలి తర్వాత తమ కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి చీకటిపేట దళిత వాడపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాద స్థితిలో ప్రాథమిక పాఠశాల
మండలంలోని చీకటిపేట ప్రాథమిక పాఠశాల ప్రమాదపు అంచున కొట్టిమిట్టాడుతోంది. ఈ భవనానికి ఉన్న మూడు పిల్లర్లు పెచ్చులూడిపోయి బీటలు వారి ఎప్పుడు కూలిపోతుందోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుతుండగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యార్థులు సంఖ్య తక్కువుగా ఉండటంతో నాడు నేడు పనులు చేపట్టలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.










