ప్రజాశక్తి-కాకినాడ పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతిరహితం, సమర్థవంతమైన పాలన అనే నాలుగు స్తంభాల ఆధారంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి నేతృత్వంలో అభివద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పని చేస్తోందని ఇందుకు టిడ్కో గృహాలు నిదర్శనమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఎపి టిడ్కో, కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్లోవపేటలో వైఎస్సార్ జగనన్న నగర్‌లో ఎపి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమం స్థానిక ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎపి టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, ఎపి టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరి శ్రీధర్, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు తదితరులతో కలిసి టిడ్కో గృహాలను ప్రారంభించారు. ఇళ్లలోని సౌకర్యాలను పరిశీలించారు. మాజీ సిఎం వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ పర్లోవపేటలో తొలిదశలో బ్లాక్-ఏలో 1,152 మందికి ఫ్లాట్లను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్-బిలోని ఫ్లాట్లను డిసెంబర్ నాటికి అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్, తాగునీరు, డ్రెయిన్లు, మురుగునీటి శుద్ధి యూనిట్, రోడ్లు ఇలా అన్ని సౌకర్యాలూ కల్పించినట్లు వివరించారు. రూ.18 లక్షల విలువ చేసే ఫ్లాట్ లబ్ధిదారులకు అందుతోందని ఈ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించినట్లు పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రం, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, పార్కు వంటివన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం ద్వారా కొత్త ఊళ్లు మనముందు సాక్షాత్కారమ వుతున్నాయన్నారు. అన్ని విధాలా నివాసయోగ్యంగా బంధుమిత్రులతో హాయిగా జీవించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ఈ ఫ్లాట్లను నిర్మించినట్లు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఫ్లాట్ల నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటు జరిగినట్లు వివరించారు. ఎపి టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరి శ్రీధర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి, నివాసయోగ్యంగా ఉండేలా తీర్చిదిద్ది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లను సైతం ఉచితంగా చేసి లబ్ధిదారులకు ఫ్లాట్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఉన్న లక్ష్యం 2,62,000 ఫ్లాట్లకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 80 వేల ఫ్లాట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. లబ్ధిదారులు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటుచేసుకొని ఈ సముదాయాల్లో ఆనందంగా జీవించాలని సూచించారు. మెప్మా అధికారులకు, బ్యాంకర్లకు కతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా వివిధ పథకాలను మహిళల పేరిట అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో టిడ్కో ద్వారా 7,288 ఫ్లాట్లు మంజూరు అయ్యాయని శుక్రవారం అందజేస్తున్న 1,152 ఫ్లాట్లతో కలిపితే మొత్తం 4,800 ఫ్లాట్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు వివరించారు. టిడ్కో డైరెక్టర్లు కానూరి నాగేశ్వరి, మెప్మా పీడీ బి.ప్రియంవద, ఇఇ పొట్ల రీటా పాల్గొన్నారు.










